logo

గ్రామీణ అంకురాలకు నాంది

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి గ్రామీణ వ్యవస్థ బలపడేందుకు ఐఐటీ మద్రాస్‌ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టింది. అక్కడే స్టార్టప్‌లు స్థాపించేలా, ఆ స్థాయికి యువతను నడపించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రతువును తమిళనాడు నుంచే చేపట్టింది.

Published : 05 Oct 2022 01:27 IST

 రాష్ట్రంలో మొదలుపెట్టిన ఐఐటీఎం
 2030 నాటికి వేయి స్టార్టప్‌లే లక్ష్యం

ఐఐటీ మద్రాస్‌ ఇంకుబెటర్ భవనం 

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి గ్రామీణ వ్యవస్థ బలపడేందుకు ఐఐటీ మద్రాస్‌ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టింది. అక్కడే స్టార్టప్‌లు స్థాపించేలా, ఆ స్థాయికి యువతను నడపించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రతువును తమిళనాడు నుంచే చేపట్టింది.
ఈనాడు, చెన్నైఇప్పుడు ఎక్కడ విన్నా నగరీకరణ, పట్టణీకరణ గురించే. ఉద్యోగాలు, సంపాదన లేకనో గ్రామాల్ని వదిలిపెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితులు పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. దీని నుంచి దేశం బయటపడేలా, గ్రామీణ వ్యవస్థల్ని బలోపేతం చేసేలా ఐఐటీఎంలోని ఇంకుబేషన్‌ సెల్‌ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. గ్రామాల్లో సవాళ్లను గుర్తించి వాటి పరిష్కారాల దిశగా అవసరమైన స్టార్టప్‌లను నెలకొల్పేందుకు యువతను సిద్ధం చేసేలా నడుంబిగించింది. మండల, నియోజకర్గ, జిల్లా కేంద్రం స్థాయుల్లో యువతలోని ప్రతిభను వెలికితీయడంతోపాటు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులుగా వారు ఎదిగేందుకు వినూత్న ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక, జ్ఞానసంపద, ప్రత్యేక శిక్షణ అందించనుంది.

తొలి విడతలో కీలకరంగాలు
కొన్ని రంగాల స్టార్టప్‌ల జాబితాను ఐఐటీ మద్రాస్‌ ఇంకుబేషన్‌ సెల్‌ తయారుచేసింది. తొలివిడతగా వాటిని స్థానికంగానే ఏర్పాటు చేయించనుంది. వ్యవసాయాధారిత అగ్రిటెక్‌, వ్యాపార మెలకువల్లో రిటైల్‌, అలాగే ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణం, సామాజిక, పరిపాలన నేపథ్యంలో సమస్యల్ని పరిష్కరించే స్టార్టప్‌లకు పెద్దపీట వేస్తోంది. ఈ తరహా స్టార్టప్‌లను 2030లోపు కనీసం వెయ్యి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి నేటివ్‌ లీడ్‌ ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఈ స్వచ్ఛంద సంస్థ తమిళనాడులో ఇప్పటికే యువతలో మార్పు తెచ్చేపనిలో ఉంది. వీరిద్వారా యువతకు శిక్షణ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది.
వారి కోసం వారే..
‘దేశానికి ఇప్పటికీ గ్రామాలే వెన్నెముక. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామ వ్యవస్థలు మరింత అవసరం. వ్యవసాయ ప్రధాన దేశంలో ఆ రంగం క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని రక్షించాలి. గ్రామాలకు ఉపయోగపడే ప్రాథమికాంశాల్లో వ్యవస్థలు బలపడేలా స్టార్టప్‌లు తేవాలని నిర్ణయించాం’ అని ఐఐటీ మద్రాస్‌ ఇంకుబేషన్‌ సెల్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ అశోక్‌ జున్‌జున్‌వాలా తెలిపారు. అక్కడి సమస్యలకు స్టార్టప్‌ల ద్వారా పరిష్కారాల్ని చూపే ప్రక్రియ మొదలైనప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఉపాధి పెరుగుతుంది. స్థానిక (లోకల్‌) స్టార్టప్‌ల వ్యవస్థ వచ్చేస్తుంది అని వివరించారు. ఇందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తమిళనాడులో మొదలైన సంస్కృతి ఇతరచోట్లకు విస్తరిస్తుందని, భారత్‌ను అఖండంగా చూసేరోజు వస్తుందని నేటివ్‌ లీడ్‌ సంస్థ ఛైర్మన్‌ నాగరాజ ప్రకాశం తెలిపారు. ప్రస్తుతం మదురై, కోయంబత్తూరు, ఈరోడ్‌, కరూర్‌, తిరుచ్చి, తూత్తుకుడిలో తమ కేంద్రాలు తెరిచామని చెప్పారు. వీటితో చెన్నై, విదేశాల్లోని వాషింగ్టన్‌, టోక్యో కేంద్రాలతో సమన్వయం చేసుకుని తమిళనాడులో స్టార్టప్‌లను వృద్ధి చేస్తామని వెల్లడించారు.
పరిశోధనల్లో మేటి
ఐఐటీ మద్రాస్‌ ఇంకుబేషన్‌ సెల్‌ దేశంలోనే ప్రసిద్ధి చెందిన సాంకేతిక పరిశోధన సంస్థగా పేరుపొందింది. ప్రధానంగా సాంకేతికతపరంగా లోతైన విశ్లేషణలు చేసి దేశానికి వినూత్న స్టార్టప్‌లను అందించడంలో తనదైన శైలిలో ముందుకెళ్తోంది. ఈ కేంద్రం ఇప్పటికే దేశంలోని 70 పరిశోధన కేంద్రాలతో కలిసి పనిచేస్తోంది. 13 రంగాల్లో 200కు పైగా స్టార్టప్లను ఏర్పాటు చేయించింది. అలాగే కేంద్రం పరిధిలో 200కు పైగా వివిధరకాల ల్యాబొరేటరీలున్నాయి. 1300కు పైగా పేటెంట్‌లను కూడా దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని