logo

మెట్రో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

: చెన్నై మహానగరంలో మెట్రో రైలు సేవలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వంతో కలిసి మెట్రో ప్రయాణికులకు వసతులు కల్పిస్తూ ‘చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌’ (సీఎంఆర్‌ఎల్‌) ముందుకు సాగుతోంది. ఇబ్బందులు లేకుండా స్టేషన్ల నుంచి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు

Published : 05 Oct 2022 01:27 IST

పైవంతెనలపై నడుస్తున్న మెట్రో రైలు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మహానగరంలో మెట్రో రైలు సేవలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వంతో కలిసి మెట్రో ప్రయాణికులకు వసతులు కల్పిస్తూ ‘చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌’ (సీఎంఆర్‌ఎల్‌) ముందుకు సాగుతోంది. ఇబ్బందులు లేకుండా స్టేషన్ల నుంచి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు మినీ బస్సులు, కొన్ని చోట్ల షేర్‌ ఆటోలు వంటివి ఏర్పాటు చేసింది. దీనికి తోడు మెట్రో స్టేషను నుంచి అవతలి వైపున ఉన్న ప్లాట్‌ఫారం లేదా స్టేషనుకు వెళ్లేందుకు ‘ఇంటర్‌ఛేంజ్‌’ వసతులు, స్కైవాక్‌, సబ్‌వేల నిర్మాణ ప్రాజెక్టులు కూడా తోడయ్యాయి. మరో నాలుగేళ్లలో ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. అందుకు తగ్గట్టు ప్రభుత్వ హైవే శాఖ కూడా పనులు వేగవంతం చేస్తోంది. మాధవరం, షోలింగనల్లూరు, పూనమల్లి వంటి శివారు ప్రాంతాల నుంచి విమానాశ్రయం, లేదా చెన్నై సెంట్రల్‌ స్టేషనుకు వెళ్లాలంటే మెట్రో ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లతో గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీలుగా మెట్రో మొదటి, రెండో దశలోని 14 ప్రాంతాల్లో వసతులున్నాయి. ఇప్పటికే ఉన్న స్టేషన్లకు సమీపంలోనే కొత్త స్టేషన్లు కూడా ఆవిర్భవించనున్నాయి. ప్రయాణికులు సొరంగ మార్గం, సబ్‌వేలు, స్కైవాక్‌, పైనడక దారి వంతెన మీద నుంచి ఒక స్టేషను నుంచి మరొక స్టేషనుకు వెళ్లే వీలుంది. మాధవరం మిల్క్‌ కాలనీ, తిరుమయిలై, షోలింగనల్లూరు, నందనం, ఆళ్వార్‌తిరునగర్‌, వలసరవాక్కం, కారంబాక్కం, ఆలపాక్కం జంక్షన్‌, పోరూరు జంక్షన్‌లలో ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాంతాల్లో మెట్రో రెండో దశ మార్గం నిర్మాణం జరుగుతోంది. కోయంబేడు, ఆలందూరు, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, కేఎంసీ, వడపళని స్టేషన్లు పూనమల్లి, మాధవరం ప్రాంతాల నుంచి సెంట్రల్‌, ఎగ్మూరు, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు మొదటి దశ, రెండో దశ మార్గం వీలుగా ఉండనుంది. ప్రయాణికులు స్టేషను నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందులో 80 శాతం మంది ప్రయాణికులు ఒక రైలు నుంచి మరో రైలుకు మారే వారే ఉంటారని సీఎంఆర్‌ఎల్‌ ఉన్నతాధికారి ఒకరన్నారు. ఇంటర్‌ఛేంజ్‌ అయ్యే స్టేషన్లలో ఆలందూరులో ఉన్నట్టుగా ప్లాట్‌ఫారాలు ఒక దాని మీద మరొకటి ఉంటాయి. రెండో దశ సేవలు ప్రారంభం కాగానే ప్రయాణికులు తమ పయనాన్ని షోలింగనల్లూరు, కీలంబాక్కం వరకు కొనసాగించే వీలుంది. రెండో దశలో ఆలందూరు, సెయింట్‌ థామస్‌ మౌంట్‌ ప్లాట్‌ఫారాలు ఇప్పటికే ఉన్న స్టేషన్లకు ఆనుకుని ఉంటాయని, టిక్కెటింగ్‌ ఫ్లోర్‌తో అనుసంధానం జరుగుతుందన్నారు. వడపళనిలో మెట్రో రెండో దశ స్టేషను అంత దగ్గరగా ఉండదని, కనుక స్కైవాక్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎంఆర్‌ఎల్‌ ఉంది.  

రంగుల సూచికలతో మేలు
సీఎంఆర్‌ఎల్‌ మాజీ డైరెక్టర్‌ ఆర్‌.రామనాథన్‌ మాట్లాడుతూ.. ఆలందూరు స్టేషనులో మొదటి దశ, రెండో దశలో ప్రయాణికులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే వీలుగా స్థలం ఉందన్నారు. ప్రయాణికులకు రెండు స్టేషన్లలో ఉన్నామనే అనుభూతి కలగదని, అలాంటి స్టేషన్లలో పది నిమిషాలకొక సర్వీసు నడపాలని, ప్రయాణికులకు తేలిగ్గా రైలు మారే వీలుంటుందన్నారు. ఇక్కడ బస్టాపులు, ప్రవేశ, బయటికి వెళ్లే ద్వారాల వద్ద సూచిక బోర్డులున్నాయి. సబ్‌వేలు, పైనడక దారి వంతెనల నుంచి పార్కింగు ప్రదేశాల వరకు లింకు ఉంది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పాలిసీ (ఐటీడీపీ - ఇండియా) ఉన్నత ప్రతినిధి శిబసుబ్రమణ్యం జయరామన్‌ మాట్లాడుతూ.. రెండు భాషల్లో సమాచారాన్ని అందించే విధానం, మ్యాపుల సూచికను సీఎంఆర్‌ఎల్‌ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు బాగుంటుందని సూచించారు. సింగపూర్‌, దిల్లీలో రంగులతో కోడ్‌ మ్యాపులుంటాయని, వీటి ద్వారా మొదటిసారి మెట్రోలో పయనించే వారికి కూడా  రంగుల ఆధారంగా తాము వెళ్లే గమ్యస్థానాన్ని తెలుసుకోగలరని అన్నారు.

 

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts