logo

Kushboo: ఇష్టానుసారం మాట్లాడితే సమాధానం వస్తుంది.. ఖుష్బూకు ‘మురసొలి’ హెచ్చరిక

మైక్‌ చేతికి అందింది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే వాటికి సమాధానాలు కూడా వస్తాయని భాజపా జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూని డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ హెచ్చరించింది.

Updated : 19 Nov 2022 10:01 IST

చెన్నై, న్యూస్‌టుడే: మైక్‌ చేతికి అందింది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే వాటికి సమాధానాలు కూడా వస్తాయని భాజపా జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూని డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ హెచ్చరించింది. తన కథనంలో... భాజపా తరఫున చెన్నైలో జరిగిన ఆందోళనలో అసలు విషయాన్ని పక్కనపెట్టి నోటికొచ్చినట్టు ఖుష్బూ మాట్లాడారని తెలిపింది. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే చాలా పార్టీలు ఫిరాయించారంటూ ఆమెను ‘తావల్‌ తిలగం’ (ఫిరాయింపు తిలకం) అని విమర్శించింది. వంటగ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలను కేంద్రం పెంచుతున్నప్పుడు మండని ఆమె కడుపు రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు, పాల ధరలు పెరగడంతో మండుతుందా? అని ప్రశ్నించింది. అది కడుపు మండటం కాదని, కడుపు మంట అని ఎద్దేవా చేసింది. డీఎంకే నిర్వాహకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు స్టాలిన్‌ కూడా క్షమాపణ కోరాలని ఖుష్బూ డిమాండ్‌ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. నేడు భాజపా కార్యవర్గ కమిటీ సభ్యులుగా ఉన్న ఆమె గురించి నాటి జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా చేసిన దిగుజారుడు వ్యాఖ్యలు మళ్లీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయని తెలిపింది. దీని కోసం హెచ్‌.రాజాను, అమిత్‌ షా, ప్రధానినీ క్షమాపణ కోరాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని