logo

ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు సన్నాహాలు

రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లను అధునాతన పద్ధతిలో అందరూ వినియోగించుకునేలా మరమ్మతులు చేసేందుకు దక్షిణ రైల్వే సన్నద్ధమవుతోంది.

Published : 01 Apr 2023 05:32 IST

చెన్నై సెంట్రల్‌లో మరమ్మతులు చేస్తున్న మరుగుదొడ్డి

వడపళని, న్యూస్‌టుడే: రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లను అధునాతన పద్ధతిలో అందరూ వినియోగించుకునేలా మరమ్మతులు చేసేందుకు దక్షిణ రైల్వే సన్నద్ధమవుతోంది. తక్కువ నిర్వహణతో, ప్రయాణికులకు పరిసరాలు శుభ్రంగా ఉండే రీతిలో చెన్నై డివిజన్‌లోని స్టేషన్లలో దక్షిణ రైల్వే ఈ-టాయిలెట్లు ఏర్పాటు చేయనుంది. ముందుగా చెన్నై సెంట్రల్‌ స్టేషనులో వీటిని ఏర్పాటు చేయనుంది. వీటి ఏర్పాటుకు కాంట్రాక్టు కూడా అప్పగించింది. మొట్టమొదట చెన్నై సెంట్రల్‌ స్టేషనులో ‘రినోవేట్‌, ఆపరేట్‌, మెయిన్‌టెయిన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌’ (ఆర్‌ఓఎంటీ) పద్ధతిలో పనులు జరగనున్నాయి. చెన్నై డివిజన్‌ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ... ఈ విధానంతో కాంట్రాక్టు అప్పగించేందుకు టెండర్‌ ఆహ్వానించామన్నారు. నగదు చెల్లించి మరుగుదొడ్లను వాడుకునే వీలుంటుందని, ఈ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు ముందుగా అన్ని కోణాల్లో అధ్యయనాలు జరిపినట్లు తెలిపారు. రూ.3.23 కోట్లతో  పదేళ్లు కాంట్రాక్టు పద్ధతిలో బాధ్యతలు అప్పగించారు.  

సెల్ఫ్‌ క్లీనింగ్‌.. ఈ-టాయిలెట్‌ సెల్ఫ్‌ క్లీనింగ్‌ (ఎవరికి వారే శుభ్రం చేసుకునే పద్ధతి)తో కూడుకున్నది. నాణేలు/క్యూఆర్‌ కోడ్‌ విధానంతో పనిచేసే ఈ మరుగుదొడ్లకు కనీస నిర్వహణ ఉంటే సరిపోతుంది. మరుగుదొడ్లలో సెరమిక్‌ ఫ్లోరింగ్‌,  ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు, కాంతివంతమైన దీపాలు, నీటి సదుపాయాలు ఉంటాయి. దక్షిణ రైల్వే నుంచి అనుమతి అందిన తర్వాత మరమ్మతుల కోసం సరికొత్త రీతిలో డిజైన్‌ రూపొందిస్తామని అధికారులు అన్నారు. చెన్నై డివిజన్‌లోని ఆవడి, కాట్పాడి, తిరువళ్లూరు, మాంబలం వంటి స్టేషన్లలో సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టాభిరాం రైల్వే స్టేషనులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్డి నెలల తరబడి మూసే ఉందని, ఇటీవలే తెరిచారని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. నిర్వహణకు సరైన కాంట్రాక్టరు కుదరకపోవడంతో తాళం వేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని