logo

తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి

తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్‌ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు.

Published : 29 Mar 2024 01:17 IST

ప్రచారంలో మాట్లాడుతున్న కనిమొళి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్‌ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి పార్లమెంట్‌లో మాట్లాడి, పోరాడి జ్యోతిమణి సస్పెండయ్యరని తెలిపారు. ఆరోగ్యం క్షీణించినా సెంథిల్‌ బాలాజీని జైళ్లో ఉంచారని వాపోయారు. ఆయన జైళ్లో ఉన్నా అన్నామలై కరూర్‌లో పోటీ చేయడానికి భయపడి కోవైలో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జీఎస్టీతో ఎంఎస్‌ఎంఈలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు భాజపా కొమ్ము కాస్తోందని అసహనం వ్యక్తం చేశారు.


ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసిన రాధిక

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రచారానికి వెళ్లిన చోట ఎక్కువ మంది జనం లేరని విరుదునగర్‌ భాజపా అభ్యర్థి రాధిక మధ్యలోనే ప్రచారాన్ని ఆపేసి వెళ్లిపోయారు. నటుడు శరత్‌కుమార్‌ తన పార్టీని భాజపాలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో విరుదునగర్‌ నియోజకవర్గ అభ్యర్థిగా తన భార్య రాధికను ప్రకటించారు. కానీ రాధికను భాజపా అభ్యర్థిగా ప్రకటించడం పార్టీలో ఉండే కొంతమందికి మింగుడు పడలేదు. అందువల్లే విరుదునగర్‌లో రాధికకు వ్యతిరేకంగా భాజపాకు చెందిన వేద దామోదరన్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తిరుప్పరకుండ్రం, తిరుమంగళం నియోజకవర్గాల్లో రాధిక ప్రచారం చేశారు. అయితే ప్రచారానికి సరిగ్గా జనం రాలేదని, భాజపా నేతలు సహకరించలేదని, మరో వైపు వేద దామోదరన్‌ మద్దతుదారులు ఆమె ప్రచారానికి అడ్డుతగిలారని, కావున ఆమె ప్రచారాన్ని మధ్యలో ఆపేసి చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది.


ఎక్కువ ఓట్లు పడేలా కృషిచేస్తే 10 సవర్ల బంగారం

మాజీ మంత్రి కృష్ణమూర్తి

మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి, ఆరణి అన్నాడీఎంకే అభ్యర్థి గజేంద్రన్‌

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై జిల్లా ఆరణి లోక్‌సభ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున గజేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆరణిలో నిర్వహించిన పరిచయ సభలో మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు. ఆరణి లోక్‌సభ నియోజకవర్గంలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని, అందులో ఏ నియోజకవర్గం వారు ఎక్కువ ఓట్లను గజేంద్రన్‌కు వచ్చేలా కృషి చేస్తారో వారికి 10 సవర్ల బంగారం బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


నటుడు విజయ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం : ఓపీ రవీంద్రనాథ్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓపీ రవీంద్రనాథ్‌ తెలిపారు. తేనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... డీఎంకే అభ్యర్థి తంగ తమిళ్‌సెల్వన్‌ గతంలో తేని జిల్లా ముద్దుబిడ్డ టీటీవీ దినకర్‌ అని ఆయన నోటితోనే అన్నారని తెలిపారు. తేని ప్రజలకు టీటీవీ దినకరన్‌ బాగా సుపరిచితుడన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వెళ్లారన్నారు. తాను, ఆయన వేర్వేరు అని భావించలేదని, అందుకే టీటీవీ దినకరన్‌కి తేని నియోజకవర్గాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అందరూ రాజకీయాల్లోకి రావొచ్చన్నారు. నటుడు విజయ్‌ పలు మంచి పనులు చేస్తున్నారని, ఆయన రాష్ట్ర ప్రజలకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆయనతో పాటు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని