logo

ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు

ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది.

Published : 29 Mar 2024 01:20 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌

వేదికపైకి వస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌, వెంట అభ్యర్థులు మాణిక్కం ఠాగూర్‌, రాణిశ్రీ కుమార్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. తెన్‌కాశి డీఎంకే అభ్యర్థి రాణిశ్రీ కుమార్‌, విరుదునగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్‌కి మద్దతుగా ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందేలా స్వర్ణయుగ పాలన అందిస్తున్నామన్నారు. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విద్య, ఉపాధి అవకాశాలు పొంది అభివృద్ధి సాధిస్తున్నారంటే వందేళ్ల ముందు తీసుకొచ్చిన చట్టాలే కారణం అన్నారు. సామాజిక న్యాయానికి భాజపాతో ప్రమాదం ఏర్పడిందన్నారు. రిజర్వేషన్‌కి భంగం కలిగించింది భాజపా అన్నారు. కుల గణన లెక్కించాలని డిమాండ్‌ చేసినా అందుకు నిరాకరిస్తోందన్నారు. మైనారిటీలకు మాత్రమే కాక మెజారిటీ ప్రజలకు భాజపా శత్రువు అన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా భాజపా అతిపెద్ద అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్తే తెలిపారన్నారు. పదేళ్లలో దేశాన్ని అగాధంలోకి నెట్టిందని, భాజపా నుంచి దేశాన్ని రక్షించడానికి ఇండియా కూటమి ఏర్పాటైందన్నారు. తమిళనాడుకి, తమిళులకు ద్రోహం చేయడమే అలవాటుగా పెట్టుకున్న ప్రధాని మోదీ ఎన్నికలు వచ్చినప్పుడు పెట్రోల్‌, డీజిల్‌, సిలిండర్‌ ధరలు తగ్గిస్తున్నారన్నారు. మోదీ ఎన్నికల హామీలకు గ్యారెంటీ, వారెంటీ లేదన్నారు. పదేళ్లలో పాలనలో ఏమీ చేయని మోదీ సేల్స్‌మ్యాన్‌లాగా ప్రకటనలు చేసుకుంటున్నారని విమర్శించారు. రూ.410గా ఉన్న వంట గ్యాసు సిలిండర్‌ ధర రూ.1000కి పైగా చేయడం వారి ఘనత అన్నారు. బాణసంచాకు జీఎస్టీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమని తెలిపారు. శివకాశి బాణసంచా పరిశ్రమను కాపాడేందుకు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చైనా టపాసులపై నిషేధం విధిస్తారన్నారు. బాణసంచా పరిశ్రమను కాపాడేందుకు భాజపా ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.

పాల్గొన్న జనసందోహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని