logo

కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ

మద్యం మత్తులో దాడిచేసిన కుమారుడిపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం తెన్నాంగూర్‌ గ్రామానికి చెందిన సురేష్‌ (35) మద్యానికి బానిసయ్యాడు.

Published : 06 May 2024 07:43 IST

సురేష్‌ (పాతచిత్రం)నిందితులు రుక్మిణి,మునియమ్మ

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: మద్యం మత్తులో దాడిచేసిన కుమారుడిపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం తెన్నాంగూర్‌ గ్రామానికి చెందిన సురేష్‌ (35) మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. రోజూ మద్యం తాగివచ్చి ఇంట్లో ఉన్న తల్లి రుక్మిణి, పెద్దమ్మ మునియమ్మను వేధించేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్‌.. తనకు పెళ్లి చేయాలని తల్లి, పెద్దమ్మతో గొడవపడ్డాడు. మద్యానికి బానిసైన అతనికి ఎవరూ పిల్లనివ్వరని అనడంతో ఆగ్రహించిన సురేష్‌ వారిపై దాడిచేశాడు. ఈ క్రమంలో తల్లి, పెద్దమ్మ మరుగుతున్న వంటనూనె అతని తలపై పోశారు. బాధ భరించలేక కిందపడ్డ అతని తలపై బండరాయితో మోది హతమార్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి నిందితులను అరెస్టు చేశారు.


సిగరెట్‌ కొనుక్కోవడానికి డబ్బులివ్వలేదని తండ్రిని చంపిన కుమారుడు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: సిగరెట్‌ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వనందుకు తండ్రిని చంపిన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్టై జిల్లా కీళకురిచ్చికి చెందిన గణేశన్‌ (60) రైతు. ఇతని కుమారుడు వినోద్‌కుమార్‌ (35) సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. ఇతను రెండేళ్ల క్రితం సొంతూరికి వచ్చి తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. ఇదిలా ఉండగా శనివారం సిగరెట్‌ కొనుక్కునేందుకు డబ్బులు కావాలని వినోద్‌కుమార్‌.. తండ్రిని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో దుకాణానికి వెళ్లి అప్పుపై సిగరెట్‌ ఇవ్వాలని దుకాణదారుడిని అడిగాడు. అతను ఇవ్వకపోవడంతో కోపంతో ఇంటికొచ్చిన వినోద్‌కుమార్‌.. తండ్రితో గొడవపడ్డాడు. ఆక్రోశంతో ఇనుపరాడ్డుతో దాడిచేసి హతమార్చాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలోని బావిలో దాక్కుని ఉన్న అతన్ని ఆదివారం అరెస్టు చేశారు.


కుమార్తెపై తండ్రి లైంగిక వేధింపులు

పోక్సో చట్టం కింద అరెస్టు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కడలూర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కడలూర్‌ సాయుధ పోలీసుదళంలో పని చేస్తున్నాడు. 14 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కొద్ది నెలలుగా తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. ఈ విషయమై బాధిత విద్యార్థిని కడలూర్‌ జిల్లా ఎస్పీ రాజారాం వద్ద ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీసు ఇన్‌స్పెక్టరు రాధిక కేసు నమోదు చేసి విద్యార్థిని తండ్రిని ఆదివారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

స్వీయ ప్రసవం చేసుకున్న నర్సు...

ప్యారిస్‌: వివాహం కాకుండా గర్భవతి అయి స్వీయ ప్రసవం చేసుకున్న నర్సును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నై కోడంబాక్కంలోని ప్రైవేటు ఆస్పత్రిలో కన్నియాకుమరికి చెందిన 24 ఏళ్ల యువతి నర్సుగా పనిచేస్తోంది. టీనగర్‌లో స్నేహితురాళ్లతో కలిసి ఉంటున్న ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి గర్భవతి అయింది. ఏడు నెలల గర్భంతో ఉన్న ఆమె స్వీయ ప్రసవం చేసుకుంది. బిడ్డను బయటకు తీయలేక ఓ కాలిని నరికింది. ఆడ శిశువు మృతిచెందింది. నర్సు కేకలు విన్న ఆమెతో పాటు ఉంటున్నవారు, శిశువు మృతదేహాన్ని, నర్సును చికిత్స నిమిత్తం ఎగ్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెపై ఆస్పత్రి నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెను ఆదివారం అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని