logo

ఉసురు తీసిన రహస్య అప్పులు..

విశాఖ సాగర తీరంలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గురువారం యువకుడి మృతదేహం, శుక్రవారం యువతి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో పోలీసులు విభిన్న కోణాల్లో వివరాలు ఆరా తీశారు. ఇంట్లో వారికి తెలియకుండా యువతి రహస్యంగా చేసిన అప్పులు ఆత్మహత్యకు

Updated : 13 Aug 2022 05:28 IST

విషయం వెలుగు చూడడంతో కుంగుబాటు

కలకలం రేపిన యువతీ, యువకుడి ఆత్మహత్య

దళాయి దివ్య (పాత చిత్రం)

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ సాగర తీరంలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గురువారం యువకుడి మృతదేహం, శుక్రవారం యువతి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో పోలీసులు విభిన్న కోణాల్లో వివరాలు ఆరా తీశారు. ఇంట్లో వారికి తెలియకుండా యువతి రహస్యంగా చేసిన అప్పులు ఆత్మహత్యకు కారణమై ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రాణాలు కోల్పోయిన దివ్య(22)ది విజయనగరం జిల్లా, యువకుడు వై. వెంకటేశ్వరరెడ్డి (32)ది నంద్యాల జిల్లా. అప్పులు చేసి వెంకటేశ్వరరెడ్డికి ఆమె డబ్బులు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇద్దరూ కలిసే ఆత్మహత్య చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

వెంకటేశ్వరరెడ్డి మృతదేహం

ఫోన్‌లో చెప్పలేనంటూ..

విజయనగరం జిల్లా విజయరాంపురం (బూరిపేట) గ్రామానికి చెందిన దళాయి దివ్య(22) చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ చూపేది. బీఎస్సీ, బీఈడీ చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యోగం వచ్చిన తరువాతే వివాహం చేసుకుంటాననడంతో ఆమె చెల్లెలికి గతేడాది వివాహం చేశారు. సుమారు ఒకటిన్నర సంవత్సర కిందట విశాఖ వచ్చిన దివ్య నగరంలోని ఓ సంస్థలో గ్రూప్‌-2కి శిక్షణ తీసుకున్నారు. అది కూడా పూర్తి కావడంతో నగరంలోనే ఉంటూ పోటీ పరీక్షలకు సాధన చేస్తున్నారు. ప్రతినెలా ఆమె అవసరాలకు సరిపడా మొత్తాన్ని తల్లిదండ్రులు పంపేవారు. మూడు నెలలుగా ఆమె తెలిసిన వారి వద్ద అప్పు చేస్తుండటంతో.. కుటుంబీకులు ప్రశ్నించినా కారణాలు మాత్రం చెప్పలేదని సమాచారం. మళ్లీ అప్పు తీసుకున్నట్లు తెలిసి విజయనగరంలోని ఆమె పెదనాన్న కుమారుడు లక్ష్మణరావు బుధవారం రాత్రి ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఫోన్లో చెప్పలేనని నేరుగా వస్తే చెబుతాననడంతో ఆయన గురువారం ఉదయం ఆరుగంటలకే  ఎంవీపీ సెక్టార్‌-1లోని ఓ ప్రైవేటు హాస్టల్‌ సమీపానికి వచ్చారు. తానే బయటకు వస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. ఆ తరువాత మళ్లీ ఫోన్‌ చేస్తే తీయలేదు. హాస్టల్‌ దగ్గరకు వెళ్లి ఆరా తీయగా బయటకు వెళ్లినట్లు నిర్వాహకులు చెప్పారు. ఆ తరువాత ఫోన్‌ స్విచ్ఛాప్‌లో ఉండటంతో గురువారం మధ్యాహ్నం ఎంవీపీ పోలీసులకు లక్ష్మణరావు  ఫిర్యాదు చేశారు.

లేఖలో ఆవేదన: దివ్య గురువారం ఉదయం ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేయకముందు తాతయ్య, మామయ్యలను ఉద్దేశించి రాసిన లేఖ కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ చేశారు. ‘నేను కొందరి నుంచి అప్పులు తీసుకున్నా. ఈ విషయాన్ని మీకు చెప్పకుండా దాచి తప్పు చేశా. చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అందరి పరువు తీసేశా. ఇక ఊళ్లో అందరూ నన్ను పురుగును చూసినట్లు చూస్తారు. దాన్ని భరించలేను. అప్పులు మిగిల్చి...తల్లికి కడుపు కోత మిగిల్చి వెళ్లిపోతున్నా. నన్ను క్షమించాలి. అమ్మా, నాన్న నన్ను క్షమించాలి’ అని ఆమె రాసిన లేఖలో ఉంది. లేఖ రాసి ఎక్కడికి వెళ్లిందో తెలియక కుటుంబసభ్యులు, పోలీసుల్లో ఆందోళన రేగింది. గురువారం పలు చోట్ల ఆరా తీశారు. శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం రామానాయుడు స్టూడియో సమీపంలోని తిమ్మాపురం సాగర తీరంలో కనిపించింది.

 తాను అప్పులు చేసింది వెంకటేశ్వరరెడ్డి కోసమేనని లేఖలో దివ్య ఎక్కడా రాయలేదు. అతను ఉద్యోగం చేస్తుండగా ఆమె నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు? వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? .దివ్య ప్రస్తుతం ఉంటున్న హాస్టల్లోకి కేవలం పది రోజుల కిందటేవచ్చింది. గతం ఎక్కడ ఉన్నారు? మృతుల ఇద్దరి ఫోన్లు ఎక్కడ ఉన్నాయి?  అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అలా వివరాలు సేకరించి..: నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం నడుంపాడు గ్రామానికి చెందిన వై.వెంకటేశ్వరరెడ్డి(32) మృతదేహం గురువారం మధ్యాహ్నమే రుషికొండ తీరానికి కొట్టుకువచ్చింది. తొలుత ఇతని వివరాలేవీ పోలీసులకు తెలియలేదు. తరువాత ఆరిలోవ పోలీసులు అతని సమాచారం స్నేహితుల ద్వారా గుర్తించారు. విశాఖలో సీఏ చదువుకోవడానికి వచ్చి... మధ్యలోనే చదువు ఆపి ఉద్యోగం చేస్తున్నట్లు వారికి తెలిసింది. దివ్య నుంచి డబ్బులు తీసుకున్నది వెంకటేశ్వరరెడ్డేనని ఎంవీపీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పులు తీసుకున్న విషయం ఇంట్లో తెలియడం... ఆ అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో పరువుపోతుందన్న ఉద్దేశంతోనే వారిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎంవీపీ సీఐ ప్రసాద్‌ ‘ఈనాడు’కు వెల్లడించారు. ఆమె చేసిన అప్పులు కూడా రూ.2లక్షల లోపే ఉన్నాయని... ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా లేకపోయినా తప్పు చేశానన్న భావనతో క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని