logo

తపాలా శాఖ సేవలు నిరుపమానం

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచానికి తెలియజేసేందుకు స్టాంపులు ఉపయోగపడతాయని, ఇటువంటి ప్రదర్శనలు తపాలశాఖకు మైలురాయి వంటివని డి.ఆర్‌.ఎం. అనూప్‌ సతపతి పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 02:32 IST

పోస్టల్‌ స్టాంపుల ప్రదర్శన సభలో వక్తలు
44 మందికి బహుమతులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచానికి తెలియజేసేందుకు స్టాంపులు ఉపయోగపడతాయని, ఇటువంటి ప్రదర్శనలు తపాలశాఖకు మైలురాయి వంటివని డి.ఆర్‌.ఎం. అనూప్‌ సతపతి పేర్కొన్నారు. రైల్వేన్యూకాలనీలోని సుబ్బలక్ష్మి కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోస్టల్‌ స్టాంపుల ప్రదర్శన ‘ఎప్పెక్స్‌ 2022’ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డి.ఆర్‌.ఎం. మాట్లాడుతూ విజ్ఞానాన్ని పెంపొందించే స్టాంపులు కూడా విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా ఉపయోగపడతాయని, ప్రపంచ విషయాలపై అవగాహనకు ఇటువంటి ప్రదర్శనలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎన్‌ఎస్టీఎల్‌) డైరెక్ట ర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ  తపాలా శాఖ దేశానికి ఎంతో సేవ చేస్తుందని, ఈ విషయం నేటి తరానికి తెలియజేసేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహద పడతాయని ఆయన పోస్టల్‌ సర్వీసు గొప్పతనాన్ని వివరించారు. అనంతరం ఎన్‌ఎస్‌టీఎల్‌, ‘ఎప్పెక్స్‌ 2022’ ప్రదర్శనపై తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్‌ కవర్లను ముఖ్య అతిథులతో కలిసి పోస్టుమాస్టర్‌ జనరల్‌ డి.వి.ఎస్‌.ఆర్‌.మూర్తి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు రోజులు ప్రదర్శన జరగ్గా...ప్రతి రోజు అయిదు వేలకు పైగా విద్యార్థులు తిలకించారని పేర్కొన్నారు. పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఆదిత్యకుమార్‌ నాయక్‌, తపాలశాఖ డైరెక్టర్లు ఎం.జగదీశ్‌ పాయ్‌  పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల అందజేత: స్టాంపుల ప్రదర్శనలో 109 మంది సేకర్తలు పాల్గొని 5,700 నమునాలు ప్రదర్శించారు. ఇందులో ఉత్తమమైన మూడింటిని ఎంపిక చేసిన స్పెషల్‌ జ్యూరీ కమిటీ వారికి బంగారు పతకాలు, మరో 41 మందికి వెండి, కాంస్య పతకాలను అందజేశారు. ప్రథమ, తృతీయ స్థానాల్లో ఎం.వి.ఎస్‌.ప్రసాద్‌, ద్వితీయ స్థానంలో జి.ఎన్‌.సురేశ్‌ నిలిచారని నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని