logo

క్షీణిస్తున్న.. ‘ఆయుష్‌’

మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఇది.. ఇక్కడ పనిచేసే వైద్యాధికారిణి ఎం.సుమ సోమ, బుధ, శుక్రవారాలు ఇక్కడ

Published : 29 Jan 2023 05:29 IST

వైద్యులు, సిబ్బంది కొరత..
రోగులకు తప్పని వెతలు

మధురవాడ ఆయుర్వేద వైద్యశాల

మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఇది.. ఇక్కడ పనిచేసే వైద్యాధికారిణి ఎం.సుమ సోమ, బుధ, శుక్రవారాలు ఇక్కడ; మిగతా మూడురోజులు కేజీహెచ్‌ ఆయుర్వేద వైద్యశాలలో ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తూ విధులు చేపడుతున్నారు. ఇలా మిగిలిన కేంద్రాల్లోనూ వేర్వేరు కారణాలతో వైద్యులు కాకుండా..సహాయకురాలే వైద్య సేవలు అందిస్తుండడంతో జిల్లాలో ఆయుష్‌ విభాగంలో ఉన్న వైద్య కేంద్రాలు నిరాదరణకు గురవుతున్నాయి.

న్యూస్‌టుడే, కొమ్మాది


* దేశీయ సంప్రదాయ వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయుష్‌ విభాగాన్ని 2007లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆయుష్‌ అంటే ఆయుర్వేదం (ఎ), యోగా (వై), యునాని (యు), సిద్ధ (ఎస్‌), హోమియోపతి (హెచ్‌)గా పేర్కొన్నారు. వీటిని విశాఖ జిల్లా పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మందులు సరిగా లేకపోవడం, వైద్యులు, సిబ్బంది కొరత తదితర కారణాలతో బాధితులు ఈ ఆసుపత్రుల వైపు రావడం తగ్గించేశారు. కరోనా ప్రభావంతో ఆయుర్వేదంపై ప్రజలకు ఆసక్తి పెరిగినా.. ఆ మేరకు ప్రభుత్వం ఈ కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగుపరిచే చర్యలు చేపట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.


ఇదీ జిల్లాలో పరిస్థితి...

విశాఖ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 12 ఆయుష్‌ వైద్యశాలలున్నాయి. ఇందులో
ఆయుర్వేదం 5, హోమియోపతి 5, యునాని 2 ఉన్నాయి.

* కేజీహెచ్‌ ఆవరణలో, మధురవాడ, శొంఠ్యాం, ఉక్కునగరం, రేవిడిలలో ఆయుర్వేద వైద్యశాలలు ఉండగా ఉక్కు నగరంలో సహాయకులే తప్ప వైద్యాధికారి లేరు. మధురవాడ, కేజీహెచ్‌ కేంద్రాల్లో వారానికి మూడు రోజులు చొప్పున వైద్యాధికారిణి విధులు చేపడుతున్నారు.

*హోమియోపతి వైద్యశాలలు ప్రసాద్‌ గార్డెన్స్‌, అడివివరం, మింది, అగనంపూడి, వేపగుంట ప్రాంతాల్లో ఉన్నాయి. వేపగుంట వైద్యులు బదిలీపై వెళ్లగా అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేరు.

* ఇక యునాని వైద్యశాలలు ఏవీఎన్‌ కళాశాల సమీప రెల్లివీధిలో ఒకటి ఉండగా, భీమునిపట్నంలో ఒకటి ఉంది. రెల్లివీధిలో ఉన్న కేంద్రంలో సీనియర్‌ వైద్యులు ఉండగా భీమునిపట్నంలో వైద్యులే లేరు. ఇన్‌ఛార్జి వైద్యులతో, అటెండర్లతో మమ అనిపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయడం లేదు. కొన్ని చోట్ల పక్కా భవనాలు, సరిపడా మందులు కూడా లేవు.


ఇవి అవసరం...

* అన్ని ఆయుష్‌ వైద్య కేంద్రాల్లో వైద్యులు, కాంపౌండర్‌, అటెండర్లు ఉండేలా నియామకాలు చేపట్టాలి.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అధికంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీటిలో కీళ్లనొప్పులు, ఉబ్బసం, అలర్జీ, థైరాయిడ్‌, పక్షవాతం, చర్మవ్యాధులతో పాటు జలుబు, దగ్గు, జ్వరం, సాధారణ నొప్పి, మూత్ర పిండాల్లో రాళ్లు, పైల్స్‌, టాన్సిలైటిస్‌ వంటి శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా వినియోగించే నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలి.
* సహజ సిద్ధమైన ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ఇలా చేస్తే ప్రాణాంతక వ్యాధుల తీవ్రతను తగ్గించగలమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.


వైద్యుల ఖాళీల భర్తీకి చర్యలు

ఆయుష్‌ ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంబంధిత నివేదిక ఉన్నతాధికారులకు పంపించాం. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ప్రకృతి సిద్ధమైన మందుల వినియోగం, వివిధ రకాల వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం.    -డాక్టర్‌ శేఖర్‌, ఆయుష్‌ ప్రాంతీయ ఉపసంచాలకుడు, జోన్‌-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని