logo

భూ వివాదాలు.. తేలేనా?

విశాఖలో సంచలనం రేపిన భూ వివాదాలెన్నో. ఆక్రమణలు.. కుంభకోణాలు.. ఇతరత్రా సమస్యలు కోకొల్లలుగా అధికారుల దృష్టికి వచ్చినా వాస్తవాలేమిటో తేల్చడం లేదు. ఇందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌) నివేదికలు కీలకంగా మారాయి.

Published : 03 Feb 2023 03:41 IST

లబోదిబోమంటున్న 22ఏ బాధితులు
ఈనాడు, విశాఖపట్నం

సిట్‌ పరిశీలనకు వచ్చిన దస్త్రాలు(పాతచిత్రం)

విశాఖలో సంచలనం రేపిన భూ వివాదాలెన్నో. ఆక్రమణలు.. కుంభకోణాలు.. ఇతరత్రా సమస్యలు కోకొల్లలుగా అధికారుల దృష్టికి వచ్చినా వాస్తవాలేమిటో తేల్చడం లేదు. ఇందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌) నివేదికలు కీలకంగా మారాయి.

ళ్లుగా అనుభవదారులుగా ఉన్న రైతులకు చెందిన జిరాయితీ భూములను 22ఏ చేర్చడంపై ఫిర్యాదులు అందాయి. కార్యాలయాల చుట్టూ బాధితులు తిరుగుతున్నా వారికి ఉపశమనం దక్కడం లేదు.  విశాఖ కేంద్రంగా 4న జరిగే ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించాలని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మొదటి సిట్‌లో..

అప్పటి గ్రేహౌండ్స్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 2017లో ఏర్పాటు చేసిన మొదటి సిట్‌కు మొత్తంగా 2,875 ఫిర్యాదులు అందాయి. ఇందులో 330 వినతులను పరిగణలోకి తీసుకున్నారు. వీటితో పాటు 15 ఏళ్లలో జారీ చేసిన 68 ఎన్‌వోసీ(నిరభ్యంతర పత్రం)లపైనా అప్పట్లో దర్యాప్తు చేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. భూ ఆక్రమణల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యక్తులు, రియల్టర్లు, కొందరు ప్రజాప్రతినిధులు... ఇలా  450 మంది పాత్ర ఉన్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం.

* అనంతరం దీనిపై ముగ్గురు సీనియర్‌ అధికారులతో గత ప్రభుత్వం కమిటీ వేసింది. విశాఖలో గతంలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లుగా పనిచేసిన 8 మంది ఐఏఎస్‌లు, 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఇంకా వంద మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఇందులోనే పలు భూములకు ఎన్‌వోసీలు ఇచ్చిన వారిపైనా క్రిమినల్‌ చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది.

* వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలోని భూ వివాదాలను నిగ్గుతేలుస్తామని 2019లో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ను సిట్‌ ఛైర్మన్‌గా నియమించి ఇద్దరు సభ్యులతో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక సమర్పించినా దాని మీదా ఎటువంటి చర్యలు లేవు. ఆక్రమణలపై ప్రభుత్వాల కంటితుడుపు చర్య తప్ప బాధితుల సమస్యలను పట్టించుకోవడం లేదని గగ్గోలుపెడుతున్నారు.

ఆశగా ఎదురు చూస్తూ..

రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ఎందరో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా 22ఏ జాబితాల్లో ఉన్న ఆస్తులను... అందులోనుంచి తొలగించుకోవడానికి వినతులు అందిస్తూనే ఉన్నారు. ఇటీవల న్యాయస్థానం ఆదేశాల మేరకు కొన్ని భూములను 22ఏ జాబితా నుంచి తొలిగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇదే సమయంలో సామాన్యులకు చెందిన సమస్యలూ పరిశీలించి చర్యలు తీసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆ భూముల నివేదిక పంపితే దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. నిషేధిత భూములపై శనివారం నాటి సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఎవరు స్పందిస్తారో..

మధురవాడలో అన్ని అనుమతులు ఉన్నాయనడంతో ప్లాటు కొనుగోలు చేశా.  తీరా ఆ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. జీవీఎంసీ వివరణ కోరితే వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌ అనుమతి ఇవ్వడంతో తాము అనుమతి ఇచ్చామన్నారు. వీఎంఆర్‌డీఏను అడిగితే.. రెవెన్యూ అధికారులు సమస్య లేదని చెబితేనే అనుమతిచ్చామన్నారు. రెవెన్యూ వారిని ఎన్నిసార్లు అడిగినా... మా సమస్యను పరిష్కరించడం లేదు.

* దీంతో విసిగిపోయిన నేను  నలుగురు సీసీఎల్‌ఏలు, ఇద్దరు సీఎంలను కలిసి వినతులు ఇచ్చా. ఎంతకూ న్యాయం జరగకపోవడంతో కొందరు ఉన్నతాధికారుల సూచనతో ఎనిమిది మంది అధికారుల మీద చీటింగ్‌ కేసు పెట్టా. ఈ మోసంపై ఇప్పటికే స్పందనలో నాలుగుసార్లు అధికారుల మీద ఫిర్యాదు చేశా. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి దీని మీద వినతి పత్రం ఇచ్చా. ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి ఎవరు స్పందిస్తారో అర్థం కావడం లేదు. ఎక్కడ తప్పు జరిగిందో తేల్చి చర్యలు తీసుకోవాలన్నదే మా విన్నప్పం.

చిన్నారావు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని