logo

ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు

జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై  అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

Updated : 28 Mar 2024 04:31 IST

ఇంత వరకు రూ.85లక్షల విలువ చేసే సొత్తు సీజ్‌
భద్రతకు అదనంగా నాలుగు కంపెనీల  కేంద్ర బలగాలు

ఇంటర్వ్యూలో కలెక్టర్‌ మల్లికార్జున

జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై  అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. పార్టీల ప్రచారాలు, వాహనాల వినియోగానికి 48గంటలలోపు అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు mవివరించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, నియమావళి అమలు సహా వివిధ అంశాలపై కలెక్టర్‌ బుధవారం ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

జిల్లాలో పోలింగ్‌ శాతం పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. 2019 ఎన్నికల్లో 65 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఈ సారి 75శాతం నమోదయ్యేలా చూస్తున్నాం. అపార్టుమెంట్‌ వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాసితులకు ఓటు వేయాలని అవగాహన కల్పిస్తున్నాం. తటస్తులై ఉండి, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల ద్వారా ఓటు ప్రాముఖ్యతపై అవగాహన శిబిరాలు నిర్వహించనున్నాం. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నీడ లేని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ రోజున షామియానాలు వేయనున్నాం. వృద్ధులు, దివ్యాంగులు అధికంగా ఉంటే కుర్చీలను ఏర్పాటు చేస్తాం. ఈసారి మూడు క్యూలైన్లు ఏర్పాటు చేయబోతున్నాం. పురుషులు, మహిళలు, దివ్యాంగులు/వృద్ధులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించనున్నాం.

10 మంది వాలంటీర్లపై వేటు

ఎపిక్‌ కార్డులో తప్పులు ఉన్నంత మాత్రాన ఓటు వేయడానికి అభ్యంతరం ఉండబోదు. 1950 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోను చేసి ఓటు సమాచారం తెలుసుకోవచ్చు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ 0891-2590100కు ఫోను చేసి సమాచారం పొందవచ్చు. అర్హులైన వారు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు. బీఎల్‌ఓలు ఇళ్లకు వచ్చి పరిశీలన చేస్తారు. దరఖాస్తు దారునితో సెల్ఫీ కూడా తీసుకుంటారు. దొంగ ఓట్ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉంటున్నాం. ఈసీ నిబంధనల ప్రకారం వాలంటీర్లు రాజకీయ పార్టీల సమావేశాల్లో పాల్గొనరాదు. ఉల్లంఘించిన 10మంది వాలంటీర్లు, పొరుగు, ఒప్పంద సేవలకు చెందిన ఇద్దరు ఉద్యోగులపై వేటు వేశాం.

479 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

ఎన్నికల ప్రచారాలకు అనుమతులు ఇచ్చే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం. ఈసీ నిబంధనల ప్రకారం పార్లమెంటు పరిధిలో నేను, అసెంబ్లీల పరిధితో ఆర్‌ఓలు అనుమతులు ఇస్తున్నారు. ఇంతవరకు అసెంబ్లీల పరిధిలో 46, నా పరిధిలో 32 అనుమతులు ఇచ్చాం. పోలింగ్‌ నిర్వహణకు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 1991 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వెయ్యి కేంద్రాల పరిధిలో వెబ్‌ కాస్టింగ్‌ పెడుతున్నాం. మిగిలిన 991 కేంద్రాల్లో 479 సమస్యాత్మకంగా గుర్తించాం. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. నాలుగున్నర కంపెనీల కేంద్ర బలగాలు అవసరమని ప్రతిపాదనలు పంపాం.

సీ-విజిల్‌ ఫిర్యాదులపై తక్షణం చర్యలు..

సీ-విజిల్‌కు ఇంత వరకు 165 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 35 ఎన్నికలతో సంబంధం లేనివిగా గుర్తించి పక్కన పెట్టాం. మిగిలిన వాటి విషయంలో వెంటనే చర్యలు తీసుకున్నాం. రాజకీయ పార్టీల ప్రలోభాలపై 88 బృందాలు నిఘా పెట్టాయి. ఇంత వరకు రూ.85లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నాం. ఇంటింటి ప్రచారాలు, వాహనాల అనుమతులకు దరఖాస్తులు వస్తున్నాయి. నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇంత వరకు జిల్లా వ్యాప్తంగా 11,200 జెండాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని తొలగించామని కలెక్టర్‌ మల్లికార్జున వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని