logo

ప్రలోభాల వల.. చిక్కితే విలవిలే!!

వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్‌ కనీసం పట్టించుకోలేదు.

Published : 06 May 2024 03:30 IST

నిర్భీతిగా పంపకాల్లో వైకాపా నేతలు
 ఆశపడితే మరో ఐదేళ్లు అంధకారంలో జీవితాలు
 సమర్థులకు ఓటేస్తేనే అభివృద్ధి ఫలాలు

ఈనాడు, ఈనాడు, డిజిటల్‌, విశాఖపట్నం: వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్‌ కనీసం పట్టించుకోలేదు. నగర పరిసరాల్లోని విలువైన భూములను చేజిక్కించుకోవడంపైనే వైకాపా నాయకులు దృష్టి పెట్టారు. సమర్థవంతమైన నాయకులు లేక అభివృద్ధి మందగించింది. దీనంతటికీ కారణం గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్‌ను నమ్మి ఓటేయడమే. నాటి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు
భారీగా డబ్బు ఖర్చు చేశారు. ‘ఒక్క అవకాశమివ్వండి’ అంటూ అప్పట్లో జగన్‌ అభ్యర్థించి అధికారంలోకి వచ్చాక గత హామీలు మరచిపోయి అన్ని వర్గాలను మోసం చేశారు. మళ్లీ ఆ తరహా ప్రలోభాలకు గురైతే మరో అయిదేళ్లు అంధకారంలోకి వెళ్లిపోక తప్పదని జిల్లా వాసులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఓట్లకు రేటు కడుతూ..: వైకాపా ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నాయకులుకొందరు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి ముందే తాయిలాల పంపిణీ మొదలెట్టేశారు. ‘తూర్పు’ నియోజకవర్గంలో తాయిలాల పంపిణీకి విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. ఎన్నికలకు వారం రోజులే ఉండటంతో వైకాపా నాయకులు ఒక్కో ఓటుకు కనీసం రూ.2 వేలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు చర్చలు సాగుతున్నాయి. వారిచ్చిన డబ్బులు తీసుకుని ఓటేస్తే ప్రశ్నించే అవకాశం కోల్పోయినట్లే. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో నిజాయతీగా ఓటేస్తేనే సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశముంటుంది. విశాఖ అభివృద్ధికి బాటలు వేయగలమని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ ఫిర్యాదుతో: సి-విజిల్‌ యాప్‌నకు వచ్చిన ఫిర్యాదు మేరకు వైకాపా అభ్యర్థి ఎంవీవీ కార్యాలయంలో తనిఖీలు సాగాయి. తొలుత ఒక బృందం తనిఖీలు చేయగా, ఎంవీవీ సన్నిహితుడు జీవీ అక్కడే ఉన్నారు. తరువాత ఆగమేఘాలపై ఎంవీవీ వచ్చారు. ఆయనతోపాటు మరొక బృందం, తర్వాత మరికొద్ది సేపటికి ఇంకో బృందం ఇలా సుమారు 25 మందికిపైగా అధికారులు, సిబ్బంది వచ్చి విస్తృతంగా తనిఖీలు జరిపారు. తనిఖీల సమయంలో ఎవరిని అనుమతించకుండా కార్యాలయానికి గేట్లు వేసేశారు. మీడియా అక్కడే ఉన్నా ఎవరికి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎవరినీ లోనికి అనుమతించలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సోదాలు జరిపారు. కార్యాలయంలో 5 అంతస్తులు ఉండగా, తనిఖీల సమయంలో మూడు అంతస్తుల దీపాలు మాత్రమే వెలుగుతూ కనిపించాయి.

అభివృద్ధికి చర్యలు శూన్యం: దేశంలోనే తొమ్మిదో అతిపెద్ద నగరం విశాఖపట్నం. ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర నగరాలతో పోటీ పడే అన్ని అవకాశాలు, వనరులూ ఇక్కడున్నాయి. గత అయిదేళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతంతమాత్రమే. పరిశ్రమలకు అనుకూల వాతావరణమున్న జిల్లాకు కొత్త సంస్థలు రాలేదు. ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక యువత వలస బాట పడుతున్నారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ఎంతో అవకాశమున్నా వైకాపా ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు. దీంతో పశ్చిమబంగ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు పర్యటకులు విశాఖను కాకుండా భువనేశ్వర్‌ను ఎంచుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. రైల్వే జోన్‌కు కూడా స్థలం ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్వయంగా పార్లమెంటులో ప్రకటించారు. అభివృద్ధికి పాతరేసి, అప్పులు చేయడంపైనే జగన్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై రూ.2 లక్షల అప్పుందని ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

5 గంటల తనిఖీల్లో ఇంతేనా?: రెండు రోజుల కిందట తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ కార్యాలయంలో ఐదు గంటల పాటు విస్తృత తనిఖీలు సాగాయి అయితే అక్కడ 500 చీరలు, 400 టీషర్టులు, 1000 వరకు ఆటో డ్రైవర్ల ఏకరూపదుస్తులు, 3 వాచీలు, రూ.30వేల నగదు, ఇతర ప్రచార సామాగ్రిని గుర్తించనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి రూ.30వేల నగదును చూపించటంపై పలు అనుమానాలు తావిస్తోంది. రూ.50వేలు దాటి ఉంటే దానికి లెక్క చెప్పాలని ఎన్నికల అధికారులు చెబుతున్నా, రూ.30వేలకు బిల్లులులేవని స్వాధీనం చేసుకోవటం విశేషం. వాస్తవానికి అది ఒక కార్పొరేటు కార్యాలయంగా పేరొందింది. అక్కడ ఇంత సమయం సోదాలు జరిపి, కేవలం రూ.2-3లక్షలలోపు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తనిఖీల బృందం తేల్చటం విశేషం. అయితే రాత్రంతా వైకాపా అభ్యర్ధి కార్యాలయంలో తనిఖీలు అంటూ మీడియాలో కథనాలు వచ్చినా, దానిపై కనీసం ఎంత స్వాధీనం చేసుకున్నది అధికారిక ప్రకటన చేయకపోవటం విశేషం. ఇటు పోలీసులు, అటు తనిఖీల బృందాలు కూడా అన్ని విషయాలను చాలా గోప్యంగా ఉంచటం పట్ల అనుమానాలు తావిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని