logo

అంబరం.. సిరిమాను శంబరం

వనమంతా జనంతో నిండిపోయింది. కొండకోనలు అమ్మ శరణుతో మార్మోగాయి. డప్పుల మోత.. థింసా నృత్యాలు.. యువకుల కేరింతలతో ఆలయ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. భక్తజనం సిరిమానోత్సవా

Published : 26 Jan 2022 06:22 IST


చదురు, వనంగుడిలో అమ్మవార్లు

ఈనాడు-విజయనగరం, సాలూరు, మక్కువ, న్యూస్‌టుడే : వనమంతా జనంతో నిండిపోయింది. కొండకోనలు అమ్మ శరణుతో మార్మోగాయి. డప్పుల మోత.. థింసా నృత్యాలు.. యువకుల కేరింతలతో ఆలయ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. భక్తజనం సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించి తన్మయత్వం చెందారు. మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సమీపంలోని చెట్ల కింద వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. మధ్యాహ్నం 11.30 గంటల తర్వాత క్యూలైన్లు రద్దీగా మారాయి. కరోనా నేపథ్యంలో గతేడాది కన్నా భక్తుల సంఖ్య కాస్త తగ్గింది.

పోలీసుల కట్టడి

రద్దీని నిలువరించడానికి పోలీసులు ఎక్కడికక్కడ భక్తులను కట్టడి చేశారు. ఓఎస్డీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో సుమారు 650 మందితో బందోబస్తు నిర్వహించారు. పార్వతీపురం డీఎస్పీ సుభాష్‌, సాలూరు సీఐ అప్పలనాయుడు పర్యవేక్షించారు. సీసీ, డ్రోన్‌ కెమెరాలతో భక్తుల రాకపోకలను గమనించారు. ● కొవిడ్‌ నియంత్రణపై వాహనాల్లో ప్రచారం చేశారు. మాస్కు ధరించని వారిని హెచ్చరించారు. ● 108, 104 వాహనాలతో పాటు ఫీడర్‌ అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. అన్ని ప్రధాన కూడళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ● సిరిమాను పూజారిపై అరటిపండ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ పండ్లను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు.

ఊరేగింపుతో ప్రారంభం: మధ్యాహ్నం 3.58 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. అంతకు ముందే ఘటాలను తీసుకొచ్చారు. పూజారి జన్నిపేకాపు భాస్కరరావు రాగానే ఘటాలను గిరడ వారింటికి తీసుకెళ్లారు. అక్కడ తొలి పూజలందుకొని తిరిగి కుప్పిలి, నాయుడు వారింటికి చేరుకున్నాయి. ఈ మూడు ఇళ్ల వద్దకు సిరిమాను చేరుకోగానే ఆయా కుటుంబీకులు పూజారి కాళ్లు కడగడంతో ఉత్సవం మొదలైంది. సిరిమాను నడి వీధి, పనుకు వీధి, గొల్ల వీధి, కొండ వీధి మీదుగా గద్దె వద్దకు చేరుకుంది. సిరిమాను వద్దకు భక్తులెవరూ రాకుండా పోలీసులు రోప్‌ పార్టీలతో కట్టడి చేశారు. పూజారిని ఇంటి నుంచి తీసుకొస్తున్న సమయంలో పలువురిని అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చేసుకుంది. సిరిమాను కొంతదూరం కదిలాక అందరినీ అనుమతించారు. సాలూరు, బొబ్బిలి ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌, సబ్‌ కలెక్టర్‌ భావన, దేవదాయ శాఖ విశాఖ ఏసీ శాంతి, డీసీ శ్రీనివాస్‌రెడ్డి, అమ్మవారిని దర్శించుకున్నారు. ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ పూడి దాలినాయుడు, ఈవో నగేష్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రాకపోకలకు అవస్థలు..: ఏటా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేవారు. ఈ ఏడాది కరోనాతో భక్తులను నియంత్రించడానికి సాధారణ రోజుల్లో లాగే రెండు బస్సులను నడిపారు. దీంతో ప్రైవేటు వాహనాలు, ఆటోలే దిక్కయ్యాయి. బస్సులను వీఆర్‌ఎస్‌ కూడలిలోనే నిలిపివేయడంతో సుమారు 2 కి.మీ. నడవాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్న పిల్లలున్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనాలను సాలూరు నుంచి వచ్చే వాటిని మామిడిపల్లి, సీతానగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాటిని చినభోగిలి, పాత బొబ్బిలి వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి ఆపేశారు.

సిరిమానోత్సవం ఇలా.. (గంటల్లో)

3.37 పూజారి రాక

3.43 సిరిమాను అధిరోహణ

3.58 ఊరేగింపు ప్రారంభం

5.35 సంబరం ముగింపు

క్యూలైన్లలో రద్దీ

సిరిమాను పైకెత్తుతున్న యువత

ఘటాల ఊరేగింపు

మొక్కులు చెల్లించుకుంటున్న మహిళలు

సిరిమానోత్సవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని