logo

పెండింగ్‌లు పెరిగి.. పరిష్కారాలు తగ్గి..

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించడంలో కలెక్టరేట్‌ అధికారులు వెనకబడుతున్నారు. గత వారం 160 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఈ వారానికి 368 పెండింగ్‌ అర్జీలు ఉండటం అధికారుల పనితనానికి అద్దం పడుతున్నాయి.

Published : 28 Jun 2022 06:45 IST


కమిషనర్‌ ప్రావీణ్యకు సమస్యలు వివరిస్తున్న మహిళలు

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించడంలో కలెక్టరేట్‌ అధికారులు వెనకబడుతున్నారు. గత వారం 160 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఈ వారానికి 368 పెండింగ్‌ అర్జీలు ఉండటం అధికారుల పనితనానికి అద్దం పడుతున్నాయి. సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, శ్రీవత్స 52 వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. వారు మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీలు ఏ దశలో ఉన్నాయో.. సంబంధిత వివరాలను అర్జీదారులకు తెలపాలన్నారు. దళితబంధు యూనిట్లతో ఉన్న లబ్ధిదారుల ఫొటోలను తీసి ఫైలింగ్‌ చేయాలన్నారు. జిల్లాలో పల్లెపట్టణ ప్రగతి పనులు నిరంతరం కొనసాగాలన్నారు. పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలను పర్యవేక్షించాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. వచ్చే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ కృషిచేయాలని సూచించారు.

సమస్యలు బాబోయ్‌

కార్పొరేషన్‌: నగరంలోని పలు కాలనీల నుంచి స్థానిక సమస్యలు వెల్లువెత్తాయి. కమిషనర్‌ ప్రావీణ్యకు సమస్యలు వివరించేందుకు కాలనీల ప్రజలు బారులుదీరారు. సోమవారం బల్దియా సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో 65 ఫిర్యాదులు వచ్చాయి. టౌన్‌ప్లానింగ్‌ 29, పన్నులు 12, ఇంజినీరింగ్‌ 10, ప్రజారోగ్యం 4, తాగునీటి సరఫరా 9, వీధి దీపాలు 1 అర్జీలు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు, రోడ్లు, లేఅవుట్‌ ఖాళీ స్థలాల ఆక్రమణలు, నల్లా నీటి సరఫరా, కలుషిత నీరు తదితర సమస్యలపై కమిషనర్‌కు మొరపెట్టుకున్నారు. ఆక్రమణలపై సత్వర చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ రషీద్‌, ఉప కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, జోనా, ఎస్‌ఈ సత్యనారాయణ, నగర ప్రణాళికాధికారి వెంకన్న, ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజారెడ్డి తదితరులున్నారు.


తన భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న అమృతమ్మ

వినతులు ఇలా..

* వరంగల్‌ దేశాయిపేట శివారు నవయుగ కాలనీ లేఅవుట్‌ ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్లు రద్దుచేయాలని, ఇంటి నంబర్లు బ్లాకు లిస్టులో పెట్టాలని, ఆర్వో, ఆర్‌ఐలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పెరుమాళ్ల లక్ష్మణ్‌ కోరారు. * హనుమకొండ ప్రాంతం ఇంటినంబరు 4-9-118 నల్లా కనెక్షన్‌ లేకున్నప్పటికీ పన్ను మదింపు చేశారని విన్నవించారు. * హనుమకొండ ప్రాంతం నయీంనగర్‌ ఇంటినంబరు 2-2-273 దగ్గర అదనపు అంతస్తు నిర్మాణంపై ఫిర్యాదు చేశారు. * ప్లాస్టిక్‌ నిషేధంపై నగర ప్రజల్లో అవగాహన కలిగేలా గోడలపై చిత్రాలు వేయించాలని ప్రేరణ విద్యా వికాస పోషణ ఫౌండేషన్‌ ప్రతినిధులు కోరారు. * బక్రీద్‌ పండుగ ఉన్నందున ఈద్గాలు శుభ్రం చేయించాలని విన్నవించారు. * టీఎస్‌-బీపాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసి 21 రోజులవుతున్నా ఇంత వరకు అనుమతి ఇవ్వలేదని వరంగల్‌ గిర్మాజిపేటకు చెందిన నసీరుద్దీన్‌ ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని