logo

రామాయణం.. చెబుతోంది జీవిత పాఠం!

రామాయణం.. జీవిత పాఠాలు ఎన్నో నేర్పిస్తుంది. ఇందులోని ఏడు  కాండలను చదివితే మన జీవితానికి ఉపయుక్తమైన వ్యక్తిత్వ అంశాలు నేర్చుకోవచ్చు.

Updated : 30 Mar 2023 05:02 IST

నేడు శ్రీరామనవమి
ఈనాడు, వరంగల్‌

రామోవిగ్రహవాన్‌ ధర్మః సాధుఃసత్య పరాక్రమః ।
రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ।।

* శరీరం ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకల ప్రాణకోటికి హితవు కలిగించే సాధుజీవనుడు. శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకంలో ఇలా నిర్వచనం ఇచ్చారు మారీచుడు.


రామాయణం.. జీవిత పాఠాలు ఎన్నో నేర్పిస్తుంది. ఇందులోని ఏడు  కాండలను చదివితే మన జీవితానికి ఉపయుక్తమైన వ్యక్తిత్వ అంశాలు నేర్చుకోవచ్చు. బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు ప్రతిదీ మన  జీవితానికి అన్వయించుకొని గొప్ప విజయాలు సాధించొచ్చు. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఏ కాండం నుంచి ఏం నేర్చుకోవచ్చో వివరిస్తూ  ప్రత్యేక కథనం..


ఆటలతో సామర్థ్యం పెంపు

మన దేశంలో పిల్లలు వారానికి 86 నిమిషాలు మాత్రమే ఆటలు ఆడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం వారానికి 420 నిమిషాలు ఆటలాడుతూ, శారీరక శ్రమ కలిగించే పనులు చేయాలి. ‘పుమ-నీల్సన్‌’ కలిసి చేసిన సర్వే సారం ఇది. దేశంలో పెద్దలు వారానికి 101 నిమిషాలు శ్రమిస్తుంటే పిల్లలు తక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది.

* ఓరుగల్లు నగరంలో మురికివాడల పిల్లల కోసం ఉద్యానవనాలు నిర్మిస్తున్నారు. మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో పిల్లలకు క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. చరవాణులను పక్కనపెట్టి  శారీరకమైన ఆటలాడాలి. ఏదైనా ఒక క్రీడలో నిష్ణాతులు కావాలి. బాల కాండ నేర్పే పాఠమిదే.


బాలకాండ

బాలకాండలో రాముడు తన సోదరులతో కలిసి అనేక ఆటలు ఆడారు. విలు విద్యలు నేర్చుకున్నారు..  ఇలా ఆటలు ఆడడం ద్వారా ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంపాదించుకోవచ్చు.  


పెద్దలమాట వినాలి

దేశంలో కోటి మందికిపైగా 60 ఏళ్ల పైబడిన వారు మంద మతి (డెమన్షియా)తో బాధపడుతున్నారని ఇటీవల కృత్రిమ మేధ ద్వారా జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. వీరిలో ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారే. తల్లి బతికుండగానే ఆమె చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రం తీసుకొన్న ఉదంతం గతేడాది మన దగ్గర వెలుగులోకి వచ్చింది. తమకు భారం అవుతున్నారని అనేక మంది వరంగల్‌లోని వృద్ధాశ్రమాల్లో పెద్దలను చేరుస్తున్న ఉదంతాలు ఎన్నో.


అయోధ్య..

పెద్దలను గౌరవించడం ‘అయోధ్యకాండ’ నుంచి నేర్చుకోవాలి. రాముడు తండ్రి ఆదేశించగానే వనవాసానికి వెళ్లారు. ఇలా పెద్దవారి మాటలను గౌరవించే కుటుంబాలు ఆదర్శంగా  నిలుస్తాయి. వారికి తగిన గౌరవం ఇస్తే సమాజం  బాగుంటుంది.  


ప్రకృతితో మమేకం..

ది ఎలిఫెంట్ విస్పర్స్‌ అనే భారతీయ లఘు చిత్రానికి మొన్న ఆస్కార్‌ పురస్కారం దక్కింది. అడవి నుంచి తప్పించుకున్న రెండు పిల్ల ఏనుగుల్ని ఓ వృద్ధ జంట అక్కున చేర్చుకొనే కథ ఇది. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కళ్లకు కట్టే నేపథ్యం. అరణ్యకాండ మనకు అదే బోధిస్తుంది.  ములుగు, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల్లోని అరణ్యాలకు వెళుతూ, అక్కడి సహజ వింతల్ని ఆస్వాదించడం జీవితంలో ఒక భాగం కావాలి.  


అరణ్య..

రాముడు వనవాసానికి వెళ్లి ప్రకృతితో మమేకమయ్యారు. అడవుల్ని కాపాడుతూ.. వీలు చిక్కినప్పుడలా ప్రకృతి ఒడిలో సేదదీరితే  జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది.


కష్టాలే సోపానాలుగా..

రామాయణంలోని సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తర కాండ.. వీటిలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి ఇవి ప్రేరణగా నిలుస్తాయి.. గతేడాది ఉక్రెయిన్‌లో యుద్ధం వల్ల మన వాళ్లూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. తాజాగా వడగళ్ల వానల వల్ల అన్నదాతలు ఆగమయ్యారు. అనారోగ్యకరమైన ఆహారం వల్ల రోగాల పాలవుతున్నారు. చిన్న విషయాలకే కుంగిపోతున్నారు. నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. రామాయణానికి దగ్గరగా ఉండటం ద్వారా ఇలాంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు.


సుందర.. యుద్ధ.. ఉత్తర..

వీటి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ధైర్యం, సాహసం, సమయస్ఫూర్తి,  నిరాడంబరత ఇలా ఎన్నో జీవిత పాఠాలను  చెబుతాయి.


ఆత్మవిశ్వాసమే అసలు బలం

నేడు చిన్న కష్టం ఎదురైతే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన జిల్లాల్లో సైతం ఇంటర్‌ పరీక్షలు రాయలేదని, పరీక్ష తప్పామని తనువు చాలిస్తున్నవారు ఉన్నారు. ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు కొన్ని రద్దయ్యాయి. గ్రూప్‌ 1  ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన వారు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంది. అలాంటి వారంతా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకెళ్లి విజయం సాధించాలి.


కిష్కింధ..

జీవితంలో ఆత్మవిశ్వాసమే అసలైన బలమని కిష్కింధకాండ మనకు చెబుతోంది. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లి సీతజాడ తెలుసుకుంటారు. ఆత్మవిశ్వాసమే అసలైన బలం అని ఈ ఘట్టం చెబుతోంది.


పఠించి ఆచరించాలి 
శేషుశర్మ, భద్రకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు, వరంగల్‌

రామాయణంలో ఏడు కాండాలు రాముడి జీవితంలో ఒక్కో దశను వివరిస్తాయి. రామాయణం ప్రతి ఒక్కరూ పఠించి అందులోని విషయాలను ఆచరించాలి. సత్యం కోసం పడ్డ తపన, భార్యకు ఇచ్చే ప్రాధాన్యం, విలువలతో కూడుకున్న జీవితానికి రామాయణ కావ్యం నిలువుటద్దం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని