logo

జిల్లా కేంద్రం.. చినుకు పడితే జలమయం

పేరుకే జిల్లా కేంద్రం. వర్షాకాలం వచ్చిందంటే కొన్ని కాలనీలు జలమయమైపోతుంటాయి. మురుగు కాలువ వ్యవస్థ సరిగా లేకపోవడం, అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టకపోవడం, కాల్వలను నీరు వెళ్లే విధంగా నిర్మించకపోవడడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆయా కాలనీవాసులు వణికిపోతుంటారు.

Published : 10 Jun 2023 02:49 IST

ములుగు, న్యూస్‌టుడే: పేరుకే జిల్లా కేంద్రం. వర్షాకాలం వచ్చిందంటే కొన్ని కాలనీలు జలమయమైపోతుంటాయి. మురుగు కాలువ వ్యవస్థ సరిగా లేకపోవడం, అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టకపోవడం, కాల్వలను నీరు వెళ్లే విధంగా నిర్మించకపోవడడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆయా కాలనీవాసులు వణికిపోతుంటారు. మురుగు కాల్వల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని చాలా సంవత్సరాలుగా పట్టణ ప్రజలు కోరుతున్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడం లేదు. ములుగు జిల్లా కేంద్రం కావడంతో నివాస గృహాల నిర్మాణం పెరిగిపోయింది. జనాభా కూడా ఊహించని విధంగా పెరిగిపోయింది. కొత్తగా కాలనీలు ఏర్పడ్డాయి. వాటిల్లో మురుగు కాల్వల నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. మురుగు, వరద నీరు రోడ్లపై నిలిచి కష్టాలు పడుతున్నారు. రానున్న వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది.

20 కాలనీలు.. 25 వేల జనాభా

ములుగు జిల్లా కేంద్రంలో సుమారు 20 కాలనీలున్నాయి. మేజర్‌ పంచాయతీ కావడంతో ములుగుతో పాటు ప్రేమ్‌నగర్‌, రంగారావుపల్లి, మాధవరావుపల్లి, పాల్‌సాబ్‌పల్లి శివారు గ్రామాలున్నాయి. ములుగు పట్టణంలో సుమారు 25 వేల జనాభా ఉంటుందని అంచనా. దాంతో పాటు సుమారు 4 వేల నివాస గృహాలున్నాయి. కాలనీల సంఖ్య, జనాభా పెరిగిపోతుండడంతో ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రధానంగా నాలుగు చోట్ల..

జిల్లా కేంద్రంలో ప్రధానంగా నాలుగు కాలనీలకు వర్షాకాలంలో ముంపు సమస్య ఉంటుంది. ప్రగతినగర్‌, శ్రీనివాసకాలనీ, వీవర్స్‌ కాలనీ, లక్ష్మీనగర్‌ కాలనీల్లో వర్షాలు పడితే రోడ్లపైనే నీరు నిలుస్తుంది. పలు ఇళ్లలోకి వరద వచ్చి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతుంటారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.


కాల్వలు నిర్మించాలి..

- చల్లూరి మహేందర్‌, ప్రగతినగర్‌ కాలనీ

ప్రతి వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటోంది. వర్షం పడితే నీరు బయటకు పోకుండా పూర్తిగా రోడ్లపైనే నిలుస్తుంది. మా కాలనీలో కల్వర్టులతో పాటు మురుగు కాల్వలు నిర్మించాలి.


నిల్వ నీటితో ఇక్కట్లు..

- పాడ్య కుమార్‌, శ్రీనివాసనగర్‌ కాలనీ

వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వచ్చి అవస్థలు పడుతున్నాం. అధికారులు చొరవ తీసుకొని క్రమ పద్ధతిలో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలి. అవసరం ఉన్న చోట కల్వర్టులు నిర్మించి నీరు సాఫీగా వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలి.


సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం..

- సిరంగి మహేందర్‌, పంచాయతీ కార్యదర్శి, ములుగు

ములుగు పట్టణంలో వర్షాకాలంలో కాలనీల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా ప్రగతినగర్‌ కాలనీ, లక్ష్మీనగర్‌లలో ఎక్కువగా సమస్య ఉంటుంది. అయితే లక్ష్మీనగర్‌లో సమస్య రాకుండా ఇప్పటికే కాల్వ తవ్వించాం. ప్రగతి నగర్‌ కాలనీలో కల్వర్టు, మురుగు కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని