logo

88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు

లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్‌ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్‌  స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు.

Published : 26 Apr 2024 04:43 IST

ముగిసిన లోక్‌సభ ఎన్నికల ప్రథమ ఘట్టం
వరంగల్‌ స్థానానికి అధికం
ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌

నామినేషన్‌ సమయం ముగియడంతో మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌ కలెక్టరేట్‌ గేట్లు మూసివేసిన పోలీసులు

లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్‌ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్‌  స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. ఈ నెల 18న స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి 25 వరకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 88 మంది తమ 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. వరంగల్‌ నుంచి 58 మంది 89 సెట్లను ఆర్వో ప్రావీణ్యకు, మహబూబాబాద్‌ నుంచి 30 మంది అభ్యర్థులు 56 సెట్లను ఆర్వో అద్వైత్‌ కుమార్‌ సింగ్‌కు అందజేశారు. అధికారులు శుక్రవారం వాటిని పరిశీలించి నిబంధనల ప్రకారం సరిగా లేని వాటిని తిరస్కరిస్తారు.

ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు సెట్లు: ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో నామపత్రాలు దాఖలు చేసేవారి సంఖ్య 2019లో 49 దాఖలయ్యాయి. వాటితో పోలిస్తే ఈసారి పెరిగాయి.  ఇందులో ఎక్కువ మంది స్వతంత్రులున్నారు. నామపత్రాల్లో ఏదైనా తప్పులు దొర్లితే పోటీకి అనర్హులవుతారని భావించిన అభ్యర్థులు ఒక్కొక్కరు గరిష్ఠంగా రెండు నుంచి నాలుగు సెట్లు దాఖలు చేశారు.

ఇక బుజ్జగింపుల పర్వం

నామపత్రాల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓ వైపు ప్రచారం చేస్తూనే.. మరో వైపు తమ ఓటు బ్యాంకు చీలకుండా  వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు తమకు నష్టం కలిగించే స్వతంత్రులను పోటీ నుంచి తప్పించి తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలనే ఆలోచనతో బుజ్జగింపుల పర్వానికి తెర తీశారు. మరోవైపు ప్రధాన పార్టీలకు చెందినవారు ప్రత్యర్థి అభ్యర్థుల ఓటు బ్యాంకును గండికొట్టే స్వతంత్రులను ఏవిధంగానైనా పోటీలో ఉండేలా సంప్రదింపులు చేసున్నట్లు సమాచారం. ఉప సంహరణ గడువు ఈ నెల 29 వరకు ఉంది.

ప్రధాన పార్టీల పరంగా పరిశీలిస్తే...

వరంగల్‌ స్థానానికి భారాస అభ్యర్థి మారపల్లి సుధీర్‌కుమార్‌ నాలుగు సెట్లు, కాంగ్రెస్‌ నుంచి కడియం కావ్య రెండు, భాజపా తరఫున అరూరి రమేశ్‌ నాలుగు, బీఎస్పీ పంజా కల్పన మూడుసెట్ల చొప్పున దాఖలు చేశారు. మహబూబాబాద్‌ స్థానానికి భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత నాలుగు, కాంగ్రెస్‌ తరఫున పోరిక బలరాంనాయక్‌ మూడు, భాజపా నుంచి అజ్మీరా సీతారాంనాయక్‌ మూడు, బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత మూడు సెట్ల చొప్పున సమర్పించారు. భాజపా, కాంగ్రెస్‌ నుంచి డమ్మీ అభ్యర్థులతోనూ నామినేషన్లు వేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని