logo

పేదింట మృత్యుఘోష

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది.

Updated : 26 Apr 2024 06:03 IST

స్నేహితుల మృతితో నాలుగు కుటుంబాల్లో విషాదం

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ  శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. బాగా చదివి భవిష్యత్తులో కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన వారు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

ఎంజీఎం ఆసుపత్రి, వర్ధన్నపేట, న్యూస్‌టుడే

ఇంటర్‌ ఫలితాలు బుధవారం విడుదల కావడంతో ఇల్లంద గ్రామానికి చెందిన పొన్నాల రనిల్‌ కుమార్‌, మల్లెపాక సిద్ధూ, కాశమర్ల వరుణ్‌ తేజ్‌, వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్‌లు ఇల్లంద గ్రామంలో కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులు చాలారోజుల తర్వాత కలిసి ఓ వివాహానికి హాజరై.. అనంతరం విందు చేసుకున్నారు. చాలా విషయాలు పంచుకొని సంతోషంగా గడిపారు. అనంతరం మల్లెపాక సిద్ధూ తన తండ్రి రాజు ద్విచక్ర వాహనంపై గణేశ్‌ను వర్ధన్నపేటలో ఇంటి వద్ద దింపేందుకు ఇల్లంద నుంచి రాత్రి 10:25 ప్రాంతంలో నలుగురు బయల్దేరారు. ఇల్లంద శివారు ఆకేరుకు వాగు వంతెన సమీపానికి వచ్చే సరికి ఎదురుగా, తొర్రూరు నుంచి వరంగల్‌ వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టింది.

ముగిసిన అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో నలుగురు మిత్రులు మృతిచెందారనే వార్త వర్ధన్నపేట, ఇల్లంద గ్రామాల్లో విషాదం నింపింది. నలుగురి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఎంజీఎం శోకసంద్రమైంది. పరీక్షల అనంతరం పోలీసులు గురువారం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గణేశ్‌కు వర్ధన్నపేటలో, సిద్ధు, రనిల్‌కుమార్‌లకు ఇల్లందలో, వరుణ్‌ తేజ్‌కు మహబూబాబాద్‌ జిల్లా సింగారంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. రనిల్‌ కుమార్‌ తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు చిల్పూర్‌ మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్‌ శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.


వేములవాడకు వెళ్దామనుకున్నాం..

మృతుడు పొన్నం గణేశ్‌ తల్లి అనురాధ

వర్ధన్నపేట గ్రామానికి చెందిన పొన్నం యాకయ్య, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు, పెద్ద కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమార్తె చదువుకుంటోంది. యాకయ్య ఆరోగ్యం బాగుండటం లేదు. కుమారుడు పొన్నం గణేష్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో ఇంటర్‌ చదువుతున్నాడు. బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు సైతం కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. పెద్దకుమార్తె కుమారుడి పుట్టువెంట్రుకలు తియ్యడానికి గురువారం సాయంత్రం వేములవాడకు వెళ్లాలనుకున్నారు. బుధవారం అంతా వర్ధన్నపేటకు వచ్చారు. ఇంటర్‌ ఫలితాలు రావడంతో పాసయ్యాననే సంతోషాన్ని తన స్నేహితులతో పంచుకుందామని వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గురువారం సాయంత్రం వేములవాడకు వచ్చి మేనల్లుడి తలవెంట్రుకలు తీస్తానన్న బిడ్డ.. కనిపించకుండా పోయాడని తల్లి గుండెలవిసేలా రోదించారు. ఏదైనా ఉద్యోగం చేసి.. చిన్నక్క పెళ్లి చేస్తానన్నాడని, పెద్ద ఇల్లు కడతానని చరవాణిలో ఇంటి నమూనా చూపేవాడని గణేశ్‌ తల్లి అనురాధ ఎంజీఎం మార్చురీ వద్ద వాపోయారు.


ఉద్యోగం చేసి పోషిస్తానన్నాడు

పొన్నాల రనిల్‌కుమార్‌ తల్లి పూల

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన పొన్నాల కుమారస్వామి- పూల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు. కూలీ పనిచేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. కుమారుడు రనిల్‌కుమార్‌ ఇంటర్‌తోపాటు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ శిక్షణ పొందుతున్నాడు. ‘స్వతహాగా మెడికల్‌ ల్యాబు ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తానని.. చెప్పేవాడని తల్లి పూల వాపోయారు. ఉన్న ఒక్క కుమారుడు లేకుండా పాయే.. మా కుటుంబాన్ని ఎవరూ చూసుకుంటారని’ విలపించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.


దిల్లీ నుంచి వచ్చిన వరుణ్‌ తేజ్‌

కాశమర్ల వరుణ్‌తేజ్‌ తల్లి సుమలత

మహబూబాబాద్‌ జిల్లా సింగారం గ్రామానికి చెందిన కాశమర్ల వెంకటేశ్‌- సుమలతలకు ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం ప్రస్తుతం ఆ కుటుంబం ఆలేరులో ఉంటోంది. పెద్దవాడు వరుణ్‌తేజ్‌ హైదారాబాద్‌లోని శ్రీచైతన్యలో ఇంటర్‌ చదువుతున్నాడు. అక్కడే వర్ధన్నపేటకు చెందిన గణేశ్‌తో పరిచయం ఏర్పడింది. పదో తరగతి ఇల్లందలో రనిల్‌ కుమార్‌, సిద్ధులతో కలిసి చదివాడు. నాలుగురోజుల క్రితం దిల్లీలో సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం చేసే తమ బంధువు ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం దిల్లీ నుంచి ఆలేరుకు వచ్చాడు. ఇంటర్‌ ఫలితాలు రావడంతో వర్ధన్నపేటలోని స్నేహితులను కలిసేందుకు ఆలేరు నుంచి వరంగల్‌కు వచ్చాడు. బుధవారం రాత్రే వరుణ్‌తేజ్‌ చనిపోయినా.. కుటుంబ సభ్యులకు విషయం గురువారం ఉదయం తెలియడంతో వారు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. కుమారుడిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. బీటెక్‌ చదివి మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పేవాడని.. అర్ధాంతరంగా మమ్మల్ని వదిలి వెళతానని అనుకోలేదని తల్లి సుమలత రోదించారు.


కానిస్టేబుల్‌ అవుతానని..

మృతుడు మల్లెపాక సిద్ధూ తండ్రి రాజు

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక రాజు- నవనీత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు దివ్యాంగుడు. పెద్దవాడు సిద్ధూ ఇంటర్‌ చదువుతున్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పేవాడని.. మృతుడు సిద్ధూ తండ్రి రాజు ఏడ్చారు. అతడిని  వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు ఓదార్చారు.


అయిదేళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజు..

వర్ధన్నపేట: అయిదేళ్ల క్రితం 2019 ఏప్రిల్‌ 24 బుధవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన మామిండ్లపెల్లి ఆదిత్య(20), బిక్కినేని మురళీధర్‌రావు(17), ఇల్లంద గ్రామానికి చెందిన గొడిశాల రాంసాయిలు(17)లు ద్విచక్ర వాహనంపై వరంగల్‌కు వేగంగా వెళుతూ పంథిని గ్రామ శివారులో చెట్టును ఢీ కొట్టారు. ముగ్గురు మిత్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తిరిగి అయిదేళ్ల తర్వాత బుధవారం రోజే ఇల్లందకు చెందిన రనిల్‌ కుమార్‌, సిద్ధూ, వరుణ్‌ తేజ్‌, వర్ధన్నపేటకు చెందిన గణేశ్‌లు ద్విచక్ర వాహనంపై వెళుతూ.. బస్సు ఢీకొట్టడంతో మృతిచెందారు. రెండు గ్రామాల ప్రజలు ఈ ఘటనలను గుర్తు చేసుకుంటూ రోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు