logo

భయం వద్దు.. ఆకాశమే హద్దు!

పరీక్షల కాలం.. విద్యార్థుల్లో భయం.. చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో..రావో వచ్చినా రాయగలుగుతామో.. లేదోనంటూ ఆందోళన.. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల వైపు పయనం.

Updated : 11 Mar 2024 05:08 IST

పరీక్షల కాలం.. విద్యార్థుల్లో భయం.. చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో..రావో వచ్చినా రాయగలుగుతామో.. లేదోనంటూ ఆందోళన.. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల వైపు పయనం. తమ చదువు తల్లిదండ్రులకు ఆర్థికభారం కావొద్దనే ఆలోచనతో బలవన్మరణాలకు తెగబడుతున్న దారుణం. మార్కులు, ర్యాంకులే చదువు కాదని.. విద్యతో కలిగే ప్రయోజనం, చదువులో వెనకబడినా.. జీవితంలో విజయం సాధించిన వారి స్ఫూర్తిగాథలతో పిల్లల్లో ధైర్యం నింపాలి. భయం వీడితే జయం మీదేనంటూ తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రోత్సహించాలి.  

ఈనాడు, మహబూబాబాద్‌

ఏటా పరీక్షలు బాగా రాయలేకపోయామని ఇంటర్‌, పది విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చరణ్‌తేజ్‌ వార్షిక పరీక్షల ఒత్తిడి కారణంగానే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్‌లో వారికి ఇష్టమున్న గ్రూప్‌లో చేరనివ్వకుండా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేర్పిస్తారు. అది విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోంది. ఎంపీసీ గ్రూప్‌ చదివితే.. మంచి ర్యాంక్‌ సాధించి ఐఐటీలో చేరొచ్చని,  బైపీసీ ఎంచుకుంటే  నీట్‌లో మంచి ర్యాంకు వచ్చి డాక్టర్‌ కావచ్చని పిల్లలపై తమ ఇష్టాలను తల్లిదండ్రులు రుద్దుతుంటారు. ఆ కోర్సులు ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రులకు చెప్పలేక ఒత్తిడితో అయిష్టంగానే చదువుతుంటారు. ఇలాంటి వారు మార్కులు తెచ్చుకోలేక ఆత్మనూన్యత భావంతో ఆత్మహత్య చేసుకోవాలనే అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.

బంధువుల పిల్లలు మంచి స్థానంలో ఉన్నారంటూ..వారిని ప్రేరణగా తీసుకోవాలని సూచిస్తూ ఒత్తిడి తేవడం. తరగతి గదుల్లోనూ అంతర్గత పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకులు భయపెట్టడంతో వార్షిక పరీక్షల సమయంలో తెలియకుండానే ఆందోళన, ఒత్తిడికి లోనవుతున్నారు. తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక పోతున్నామనే మనోవేదనకు లోనై చావే పరిష్కారం అన్న తీవ్ర నిర్ణయం తీసుకుంటారు.

ఇలా చేద్దాం

చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాల ప్రకారం నడుచుకోవాలి. వారు ఎలాంటి కోర్సులో చేరాలనుకుంటున్నారో.. దాని ప్రయోజనాలు,  చదవగల సామర్థ్యాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి.  

పరీక్షల్లో వచ్చిన మార్కుల గురించి ఆలోచించకుండా పిల్లల్లోని ఇతర నైపుణ్యాలను మెచ్చుకోవడం వల్ల  వారిలో మంచి మార్పు వస్తుంది. ః విద్యార్థుల్లో ఉన్న భయాన్ని, ఆందోళనని పారదోలుతూ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా మరో మార్గాన్ని ఎంచుకోవచ్చంటూ భరోసా కల్పించాలి.

ఇవి గమనించాలి: ఆత్మహత్య చేసుకోవాలనుకునే విద్యార్థులు  ఒంటరిగా ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూడా ఆందోళనతో దిగాలుగా ఉంటారు. చదివే సమయంలో డల్‌గా ఉంటారు. తోటి  స్నేహితులకూ దూరంగా ఉంటారు.ఈ  లక్షణాలు గమనించి ఆ ఆలోచనల నుంచి దృష్టి మళ్లించాలి.

గతంలోని సంఘటనలు

  • 2023 మేలో మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలానికి చెందిన తేజావత్‌ సింధు ఇంటర్‌ వృత్తి విద్య ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో  ఆత్మహత్య చేసుకుంది.  
  • 2023 ఏప్రిల్‌ 11న మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్టతండాకు చెందిన గుగులోతు కృష్ణ  నీట్‌  రాసినా సీటు రాదనే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వీరే స్ఫూర్తి

ఐఏఎస్‌ అధికారి అంజుశర్మ పదో తరగతిలో, ఇంటర్లో ఫెయిల్‌ అయ్యారు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుకున్న ఆమె ఆ తరువాత ఐఏఎస్‌ అధికారిగా అయ్యారు.

ఆపిల్‌ ఫోన్‌ సృష్టికర్త స్టీవ్‌ జాబ్స్‌ కూడా కళాశాలలో డ్రాప్‌ విద్యార్థి. అయినా ఆయన మనోవేదనకు గురికాలేదు. ఆయన ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరు.

 మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తనకు ఇష్టమైన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఆ వైపుగా ఎదిగారు. క్రికెట్‌ దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు.

ఓడిన చోటే గెలుపు సాధించాలి : బరుపాటి గోపి, సైకాలజిస్టు, వరంగల్‌

పరీక్షలను పాజిటివ్‌ ఆలోచనలతో రాయాలి. భయాన్ని వీడి ఇష్టంతో చదివితే గుర్తుంటాయి. తల్లిదండ్రులు కూడా చదవటం లేదని..నిరాశకు గురిచేయకుండా బాగా చదువుతావంటూ ప్రోత్సహించాలి. ఓడిన చోటనే గెలుపును సాధించాలి. ఎందరో జీవితగాథలను చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలి

ఇంటర్‌, డిగ్రీలో తప్పాను: గండ్రాతి సతీష్‌, ఎస్సై, నర్సింహులపేట

ఇంటర్‌లో సప్లిమెంటరీ రాసి పాసయ్యాను. డిగ్రీలోనూ రెండు సార్లు ఫెయిలయ్యా. మనోధైర్యం కోల్పోకూడదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో డిగ్రీ పాసయ్యా. సర్కారు కొలువు సాధనే లక్ష్యంతో మొదటిసారి ఎస్సై ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం రాలేదు. ఇతర కొలువులు వచ్చినా ఎస్సై పరీక్ష రాసిఅనుకున్నది సాధించా.

న్యూస్‌టుడే, నర్సింహులపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని