logo

పల్లెల్లో బెట్టింగ్‌ల జోరు

పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్‌ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.

Published : 29 Mar 2024 05:54 IST

న్యూస్‌టుడే, మహదేవపూర్‌ : పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్‌ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. మహదేవపూర్‌ మండలంలో మహదేవపూర్‌, కాళేశ్వరం, బ్రాహ్మణపల్లి, బొమ్మాపూర్‌, బెగ్లూర్‌, సూరారం, అంబట్‌పల్లి, కుదురుపల్లి, కాటారం, మహాముత్తారం, పలిమెల మండలాల్లో విచ్ఛలవిడిగా ఈ వ్యవహారం సాగుతోంది. ఐపీఎల్‌ సీజన్‌ సాగుతుండడంతో బెట్టింగ్‌ వ్యసనంలా మారింది. గ్రామాల్లో కొందరికి లాభాలు వస్తుంటే.. మరికొందరు నష్టాల్లో మునుగుతున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, యాప్స్‌లో సొమ్ము పెట్టి మ్యాచ్‌లతో పాటు ఒక్కో బంతి చొప్పున సైతం సొమ్ము పెట్టి నష్టపోతున్నారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు, యువకులు బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. వ్యక్తిగతంగా, కొంత మంది యువకులు కలిసి మెసేజ్‌లు చేస్తూ వ్యవహారం సాగిస్తున్నారు. మహదేవపూర్‌ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి క్రికెట్‌, కబడ్డీ, తదితర బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. వ్యాపారంలో వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్‌లకు మళ్లించి ఆర్థికంగా నష్టపోయాడు. రూ.లక్షల్లో నష్టపోవడంతో ఇప్పుడు అప్పుల ఉబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడి సర్వం కోల్పోయాడు. మారుమూల పల్లెల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. మండల కేంద్రాలతో పాటు మారుమూల పల్లెలకు బెట్టింగ్‌ విస్తరించడంతో యువకులు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పోలీస్‌ శాఖ నిఘాపెట్టి బెట్టింగ్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు