logo

ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా

ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు.

Published : 29 Mar 2024 05:57 IST

భూపాలపల్లి, న్యూస్‌టుడే : ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. రూ.లక్ష వరకు బకాయిలున్న వారి దుకాణాల వద్దకు వెళ్లి తాళాలు వేస్తున్నారు. సుమారు 70 శాతం నుంచి 80 పన్నులు చెల్లించి, మిగతా బకాయిలు రెండు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినా వినడం లేదు. మరో రెండు రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న సందర్భంగా పురపాలక సంఘం పరిధిలో వంద శాతం వరకు ఆస్తి పన్ను వసూలు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌ తెలిపారు. పన్నుల వసూళ్ల కోసం మొత్తం తొమ్మిది బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివారం సెలవు రోజుల్లోనూ సిబ్బంది పన్నులు వసూలు చేస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలో మొత్తం 30 వార్డుల్లో 12,362 నివాస గృహాలు, ప్రభుత్వ భవనాలు, సింగరేణి క్వార్టర్లు 1120 వరకు ఉన్నాయి. వీటి ద్వారా ఆస్తి పన్ను రూ.6.22 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.4.84 కోట్ల వరకు వసూలు చేశారు. దీంతో ఆస్తి పన్ను వసూలు 74 శాతం వరకు నమోదైంది.

ఆస్తుల జప్తునకు పాల్పడుతూ : ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించని మొండి బకాయిదారులకు సంబంధించి ఆస్తుల జప్తునకు పాల్పడుతున్నారు. బకాయిదారులకు ముందుగా పన్ను చెల్లించాలని రెండు సార్లు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా, నిర్లక్ష్యం చేస్తే ఇళ్లల్లో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు సైతం తీసుకొస్తున్నారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో పాటు కమిషనర్‌ రాజేశ్వర్‌ తదితర అధికారులు కలిసి గురువారం ఉదయం గణేష్‌చౌక్‌ ప్రాంతంలో ఆస్తి పన్ను బకాయిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి దుకాణాలకు తాళం వేస్తామని హెచ్చరించడంతో పలువురు యజమానులు పన్నులు చెల్లించారు. పట్టణ ప్రజలు ఆస్తిపన్ను సకాలంలో చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, కార్మికులు సహకరించాలని వెంకటేశ్వర్లు కోరారు. ఆయన వెంట మేనేజర్‌ స్వామి, ఆర్‌ఐ భాస్కర్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని