logo

దిగుబడి లేక దిగాలు

ఖరీఫ్‌, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్‌బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది.

Published : 28 Mar 2024 04:33 IST

నష్టాలు మిగిల్చిన మినుము సాగు

యంత్రంతో మినుము తీత

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఖరీఫ్‌, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్‌బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ ఏడాది వరిసాగు చివరి దశలో తుపాను వచ్చి తుడిచిపెట్టుకుపోగా, ఆ తర్వాత సాగు చేసిన మినుము ఆశించిన దిగుబడి రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. ధరలు ఆశాజనకంగా ఉన్నా దిగుబడి అంతంతమాత్రంగానే ఉండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లా రైతులు ఈ ఏడాది రబీ సీజన్‌లో 23,935 ఎకరాల్లో మినుము సాగు చేశారు. ఎల్‌బీజీ 752, 646, 932, 787 వంటి రకాలను ఎంపిక చేసుకున్నారు.

అదును దాటాక విత్తనాలు.. దిగుబడి తగ్గడానికి విత్తనాలు ఆలస్యంగా చల్లడం సైతం ఓ కారణంగా తెలుస్తుంది. గతేడాది వచ్చిన తుపానుతో వరి పైరు ముంపు బారిన పడగా దాని నుంచి పొలాలు తేరుకునేందుకు దాదాపు 20 రోజులు పట్టింది.
అందని నీరు..అనుకూలించని వాతావరణం.. రబీలో మినుము పైరుకు వాతావరణం అంతగా అనుకూలించలేదు. విత్తనాలు చల్లిన నాటి నుంచి నేటి వరకు ఎండలు విపరీతంగా ఉండడం, ఆకు తెగుళ్లు ఆశించడంతో రైతులకు నష్టం వాటిల్లింది. దానికి తోడు కనీసం ఒక తడికి సైతం నీరు విడుదల చేయకపోవడంతో కొన్ని చోట్ల పైరు ఎండిపోయింది. రాత్రిపూట మంచు తక్కువ కురవడం, అధిక ఎండలకు గాల్పులు తోడవడంతో వాటి ప్రభావం దిగుబడులపై పడిందని, ప్రస్తుతం యంత్రాలతో నూర్పిడి చేస్తుంటే ఎకరానికి మూడు బస్తాల్లోపే దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. మినుము మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6900 ఉండగా, మార్కెట్టులో రూ.9 వేల నుంచి రూ.9,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎంత ఉన్నా దిగుబడి తగ్గడంతో ఆశించిన ఫలితం లేకపోయిందని రైతులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని