logo

మధ్యంతర భృతికి మంగళం

ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చే పద్ధతికి జగన్‌ సర్కార్‌ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది.

Updated : 23 Apr 2024 06:37 IST

జులైలో పీఆర్‌సీ ఇస్తామంటూ కల్లబొల్లి హామీ

 

తాడేపల్లిగూడెంలో ఉపాధ్యాయుల నిరసన (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్‌, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చే పద్ధతికి జగన్‌ సర్కార్‌ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ జులైలో ఒకేసారి పీఆర్‌సీ ఇస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. సాధారణ ఎన్నికల ముందు ఐఆర్‌ తక్కువగా ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మరింత పెరుగుతుందని ఐఆర్‌ ఇవ్వకుండా దాటవేసింది. దీన్ని సమర్థించుకునేందుకు జులైలో ఏకంగా పీఆర్‌సీనే ఇచ్చేస్తామనే హామీని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 11వ పీఆర్‌సీ సమయం గతేడాది జూన్‌తో ముగిసింది. జులై నుంచి కొత్త పీఆర్‌సీ అమలు కావాల్సి ఉంది. ఉద్యోగుల సమస్యలపై రెండు నెలల క్రితం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు నిర్వహించింది. ఉద్యోగులు ఐఆర్‌ అడగ్గా పీఆర్‌సీయే ఇచ్చేస్తాం కదా అంటూ మంత్రివర్గం హామీ ఇచ్చింది. నేటికీ అమలు కాలేదు.  
నాడు 
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. గతంలో తెదేపా పాలనలో ఉద్యోగులను అణగదొక్కారు. - పాదయాత్ర సమయంలో వై.ఎస్‌.జగన్‌ పలికిన ప్రగల్భాలు.
నేడు
సీఎంగా కొలువుదీరాక ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై మౌనం దాల్చారు. ఉద్యమించేందుకు సిద్ధమైతే నోటీసులు, గృహ నిర్బంధాలు.. అరెస్టులు. ఆనక బెదిరింపులు.
ఏడాదికి పైగా నష్టపోయే ప్రమాదం
12వ పీఆర్‌సీ కమిషన్‌ను జులై 2023లో ప్రభుత్వం ఏర్పాటుచేసినా ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఎక్కడైనా నాలుగు నెలల్లో పీఆర్‌సీ ప్రక్రియ పూర్తయి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు ఐఆర్‌ రాకపోతే దాదాపు ఏడాదికి పైగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్‌ ఉద్యోగుల వరకు 34వేల మంది ఉన్నారు. ఆర్‌టీసీ, సచివాలయ ఉద్యోగులను కలిపితే సుమారు 52వేల మంది ఉన్నారు. అయిదేళ్ల కాలంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా, డిమాండ్‌ చేస్తే భయపెట్టే ప్రయత్నం చేసిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్‌ మాట తప్పారని, మడమ తిప్పారని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి.

బకాయిలు రూ.80కోట్లకు పైగానే

మొదటిసారి పీఆర్‌సీ నివేదిక కాకుండా ఆఫీసర్స్‌ కమిటీ నివేదికను ఆమోదించి ప్రభుత్వం కొత్త పోకడ సృష్టించింది. ఎన్నికల హామీగా ప్రకటించిన 27శాతం మధ్యంతర భృతి కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ 23శాతం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో రెగ్యులర్‌, పింఛనుదారులకు సంబంధించి రూ.80 కోట్లకు పైనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది.

తిరుపతిరావు, ఉపాధ్యాయుడు


తీవ్ర నిరాశ మిగిల్చింది

ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ నాలుగు శాతం తగ్గించడం దేశంలో ఎక్కడా జరగలేదు. దీంతో సగటు ఉద్యోగికి తన సర్వీసు కాలంలో రెండు, మూడు ఇంక్రిమెంట్లు నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా లేదు.- టి.భాస్కరరావు, ఉపాధ్యాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు