logo

ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే సీమకు అన్యాయం

ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే రాయలసీమ అన్యాయమైపోతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

Published : 06 Feb 2023 02:27 IST

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి  

మాట్లాడుతున్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి

మైదుకూరు, న్యూస్‌టుడే: ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే రాయలసీమ అన్యాయమైపోతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించాలనే డిమాండును ఎవరూ వినిపించడంలేదని అన్నారు. రాయలసీమలో ప్రవహించే నీటిని నిల్వ చేసుకోకపోతే ఈ ప్రాంతం ఎడారికాక ఏమవుతుందని ప్రశ్నించారు. ‘కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి’ అన్న డిమాండుతో ఆదివారం రైతు సేవా సమితి, ప్రజాపక్షం ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయల సీమను సాకుగా చూపి కృష్ణా డెల్టాకు నీరు తీసుకుపోవాలనే ధోరణి కనిపిస్తోందన్నారు. బచావత్‌ అవార్డు ప్రకారం రాయలసీమలో 19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు పారుతోందని తెలిపారు. సిద్ధేశ్వరం, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మిస్తే సీమకు మేలు జరుగుతుందనే విషయమై ఏ పార్టీ మాట్లాడడం లేదని మండిపడ్డారు. నాగార్జునసాగర్‌కు 264 టీఎంసీల నీరిచ్చి మిగిలిన నీటిని శ్రీశైలంలో నిల్వ చేయక జలాశయాన్ని ఖాళీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో ప్రజాపక్షం కన్వీనర్‌ గోశెట్టి వెంకటరమణయ్య, కేసీ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్‌ఛైర్మన్‌ రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని