logo

ఆసుపత్రిలో లంచం తీసుకోవడంపై విచారణ

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసిన సంఘటనపై సోమవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు.

Published : 28 Mar 2023 03:14 IST

వైద్యురాలు రాజీనామా

ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్న డాక్టర్‌ పాల్‌ రవికుమార్‌

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసిన సంఘటనపై సోమవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు. విచారణ అధికారి డాక్టర్‌ పాల్‌ రవికుమార్‌ ఆసుపత్రిలో గర్భిణి కాన్పు అయిన రోజు కాన్పుల వార్డు, ఆపరేషన్‌ థియేటర్‌లో విధులు నిర్వర్తించిన వైద్య సిబ్బందితో మాట్లాడారు. వారి నుంచి రాతపూర్వకంగా నివేదికలు తీసుకున్నారు. తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన గర్భిణి అరుణ కుటుంబ సభ్యులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. విచారణాధికారి మాట్లాడుతూ.. విచారణ నివేదికను ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అందజేస్తామన్నారు. ఆసుపత్రిలో డబ్బు తీసుకున్న సంఘటనపై బాధితులు అయిదుగురిపై ఫిర్యాదు చేశారన్నారు.

* జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎస్‌ఎన్‌సీయూ విభాగం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. ఈ విభాగంలో పని చేస్తున్న ప్రైవేట్‌ వైద్యురాలు వెన్నెల ఈ నెల 15వ తేదీన కాన్పు అయిన అరుణ బిడ్డకు ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆ బిడ్డ శరీరంపై బొబ్బలు రావడంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లి మందులు తెచ్చుకోవాలని బాధిత కుటుంబీకులకు మందుల చీటీ రాసి ఇచ్చారనే అభియోగంపై వైద్యురాలిని విచారించారు. దీంతో ఆమె తన రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ప్రైవేటు సంస్థకు పంపారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు భాగాస్వామ్య పద్ధతిలో స్థానిక జిల్లా ఆసుపత్రిలో ఎస్‌ఎన్‌సీయూ నిర్వహణ జరుగుతోందన్నారు. అయితే తమ సంస్థ వారు ఎస్‌ఎన్‌సీయూ బాధ్యత మాత్రమే తమకు అప్పగించారని ఆసుపత్రిలో అధికారులు మాత్రం ఎస్‌ఎన్‌సీయూతో పాటు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం చికిత్సలు కూడా అందించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఎన్‌సీయూ వదలి వేరే చోట చికిత్సలు చేసే సమయంలో ఎస్‌ఎన్‌సీయూలో ఎవరికైనా ఏమైనా అయితే బాధ్యులెవరని ఆమె ప్రశ్నించారు. బిడ్డకు బొబ్బలు తగ్గేందుకు తాను మందులు తెచ్చుకోవాలని రాసిచ్చానని.. ప్రైవేట్‌ దుకాణానికి వెళ్లమని చెప్పలేదన్నారు. బాధితులు బయట మందుల దుకాణంలో మందులు తెచ్చుకుంటే తాను బాధ్యురాలిని కాదన్నారు. ఆసుపత్రిలో కావాలనే కొందరు వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని అందుకే తాను విధులకు రాజీనామా చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని