logo

భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి

భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి.

Published : 28 Mar 2024 03:56 IST

బద్వేలులో రోషన్నకే అవకాశం
రాజంపేటపై సర్వత్రా ఆసక్తి

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు, బద్వేలు : భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. జమ్మలమడుగు స్థానం బదులుగా కడప పార్లమెంటు నుంచి పోటీకి అవకాశం కల్పించాలని ఆదినారాయణరెడ్డి భాజపా అగ్రనేతలతో పాటు తెదేపా నాయకుల వద్ద ప్రస్తావించారు. అసెంబ్లీ నుంచి పోటీకే భాజపా అగ్రనేతలు బుధవారం టిక్కెట్‌ ఖరారు చేశారు. తెదేపా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న భూపేష్‌రెడ్డిని కడప పార్లమెంటు స్థానం నుంచి రంగంలోకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి రంగంలోకి దిగడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. బద్వేలు సీటును ఆశించిన భాజపా..తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న బొజ్జా రోషన్నను పార్టీలో చేర్చుకుని టిక్కెట్‌ ఇచ్చింది. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట మినహా మిగిలిన అన్ని స్థానాలకు కూటమి తరఫున తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది. తెదేపా రాజంపేట అసెంబ్లీ, కడప పార్లమెంటుకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. 


పేరు: చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి నియోజకవర్గం: జమ్మలమడుగు
వయసు: 65
స్వగ్రామం: దేవగుడి, జమ్మలమడుగు మండలం
చదువు: ఎమ్మెస్సీ (కెమెస్ట్రీ)
వృత్తి: రాజకీయం
తల్లిదండ్రులు:  వెంకట సుబ్బమ్మ, సుబ్బరామిరెడ్డి
భార్య: అరుణ
సంతానం: సుధీర్‌రెడ్డి, దీప్తి    
రాజకీయ నేపథ్యం: 2004, 2009లలో జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైకాపాలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైకాపా అధినేత జగన్‌తో విభేదాలతో 2016, ఫిబ్రవరిలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా ప్రభుత్వంలో రాష్ట్ర పశుసంవర్ధక, సహకారశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019, అక్టోబరు 21న జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరారు. అప్పటి నుంచి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.


పేరు: బొజ్జా రోషన్న  
నియోజకవర్గం: బద్వేలు (ఎస్సీ రిజర్వుడు)
వయసు: 59
స్వగ్రామం: గిరినగర్‌, పోరుమామిళ్ల 
చదువు: బీటెక్‌
వృత్తి: డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇరిగేషన్‌ ఇంజినీరు (క్వాలిటీ కంట్రోల్‌), నంద్యాల 
తల్లిదండ్రులు: బొజ్జా గోపన్న, రాములమ్మ
భార్య: అరుణ
సంతానం: క్రాంతి రోషన్‌, స్వస్తిక్‌ రోషన్‌
రాజకీయ నేపథ్యం:
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఉద్యోగానికి రాజీనామా చేసి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేశారు. ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆ పార్టీలోకి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని