logo

వైకాపా పాలన... పసిడిపురి వాసుల ఆవేదన

ప్రొద్దుటూరు బంగారం, వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా పేరుంది. ఇంతటి ప్రాధాన్యం కల్గిన పట్టణం ప్రవేశ, ప్రధాన అంతర్గత రాదారులు అధ్వానంగా ఉన్నాయి.

Published : 06 May 2024 04:12 IST

రహదారుల విస్తరణ, స్వాగత తోరణాలు ఏవి?  
అమలుకు నోచని ఎమ్మెల్యే రాచమల్లు హామీలు

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు బంగారం, వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా పేరుంది. ఇంతటి ప్రాధాన్యం కల్గిన పట్టణం ప్రవేశ, ప్రధాన అంతర్గత రాదారులు అధ్వానంగా ఉన్నాయి. జనాభా, వాహనాల పెరుగుదలకు తగ్గట్టు విశాలమైన దారుల్లేవు. ఇరుకుగా ఉండడంతో దినదిన గండంగా పాదచారులు, వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పర్యటిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే పట్టణానికి ప్రధాన ప్రవేశ మార్గాల్లో స్వాగత ఆర్చరీలు ఏర్పాటు చేసి, అంతర్గత రహదారులను విస్తరింపజేసి సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి అయిదేళ్లు పూర్తయినప్పటికీ ఒక్క ప్రవేశ మార్గం కూడా అభివృద్ధికి, సుందరీకరణకు నోచుకోలేదు. ఇరుకైన ప్రవేశ మార్గాలతో ఎన్నాళ్లీలా ఇబ్బందులను ఎదుర్కోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్టణంలో చిన్నశెట్టిపల్లె రోడ్డు ఇది. దీని మీదుగా పెద్దముడియం మండలం పెద్దపసుపులు, జి.కొత్తపల్లె, ఉలవపల్లి, నెమళ్లదిన్నె ప్రజలు రాకపోకలు సాగిస్తారు. 23 కి.మీ మేర ఉన్న రోడ్డు నడిచేందుకు  వీల్లేకుండా గుంతలు పడి ప్రమాదకరంగా ఉంది. అయిదేళ్ల వైకాపా పాలనలో ఒక్క గుంతక్కూడా అతుకేసిన స్థితి లేదు. 10 కి.మీ దూరం అభివృద్ధి చేయాలని రూ.3 కోట్లు నిధుల కొరకు అధికారులు పంపిన దస్త్రానికి సమాధానమే లేదు.

ట్టణంలోని పొట్టిపాడు రోడ్డు రాజుపాళెం, పెద్దముడియం మండలాలను అనుసంధానంగా ఉంది. అర్కటవేముల వరకు 14 కి.మీ ఉంది. గోతులు పడి ప్రమాదాలకు నిలయమైంది. అనేక మంది కింద పడి గాయాలపాలైన దాఖలాలు కొకొల్లలు. 3.75 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయాలని రూ.3.50 కోట్లు నిధుల కొరకు ప్రతిపాదన పంపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు.

ట్టణంలోని మడూరు, గుడిపాడు రోడ్డు ఇది. రింగ్‌ రోడ్డు నుంచి రిజిస్ట్రార్‌ కార్యాలయం వరకు నాలుగు వరుసల దారిని నిర్మించాలని గత ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. రింగ్‌రోడ్డు నుంచి ఎంజీ ఆటో నగర్‌ వరకు సుమారు 300 మీటర్లు మేర నాలుగు వరుసల దారిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పనులు చేస్తుండగా కొత్తగా వైకాపా ప్రభుత్వం వచ్చి 25శాతం లోపు పనులను రద్దు చేసింది. రివర్సు టెండర్లు పిలుస్తామని చెప్పి ఇంత వరకు ఆ రోడ్డు గురించి ఊసే ఎత్తలేదు.

ట్టణంలోని కొర్రపాడు రోడ్డు రాజీవ్‌ కూడలి నుంచి రింగు రోడ్డు వరకు 2 కి.మీ విస్తరించింది. అత్యంత ప్రధానమైన రహదారిది. గత ప్రభుత్వం 40 సెంట్రల్‌ విద్యుత్తు దీపాలు అమర్చింది. ఆ తర్వాత ఏర్పడిన వైకాపా ప్రభుత్వం అయిదేళ్లయినా ఒక్క ఫైసా అభివృద్ధి చేయలేదు. రెండేళ్ల క్రితం 25 మీటర్ల వెడల్పుతో  నిర్మించేందుకు రూ.80 కోట్లు నిధులు కావాలని  కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ట్టణంలోని రిలయన్స్‌ పెట్రోలు బంకు నుంచి వాసవి కూడలి వరకు ఉన్న దారి అత్యంత ప్రమాదకారి. దారికిరువైపులా విద్యుత్తు స్తంభాలు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండడంతో భయం, భయంగా ఉంటుంది. ఏడాదిన్నర క్రితం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వాహనం ఢీ కొని మృతి చెందారు. దీన్ని అధిగమించేందుకు  2.2 కి.మీ మేర నాలుగు వరుసల దారి ఏర్పాటుకు రూ.13.36 కోట్లు అధికారులు ప్రతిపాదన పంపినా అతిగతీ లేదు.

ప్రొద్దుటూరు పట్టణంలో రిలయన్స్‌ పెట్రోలు బంకు-చౌటపల్లె వైఎస్‌ విగ్రహం రోడ్డు 6.6 కి.మీ  (ఎంఎన్‌బీబీ) విస్తరించింది. ఇది చాలా ఇరుకుగా ఉంది. 60 నుంచి 80 అడుగుల మేరకే వెడల్పు ఉంది. పాదచారులు, వాహనాలకు నరకయాతన తప్పదు. ముఖ్యంగా రోడ్డుకిరువైపులా ఉన్న విద్యుత్తు స్తంభాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఆక్రమణలు తొలగించి 100 అడుగులు వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని