logo

Cheating: దోస్తు పేరు చెప్పి రూ.1.22 లక్షలు స్వాహా

సంక్రాంతి పండుగ సమయంలో దోస్తు పేరు చెప్పి రూ.1.22 లక్షలు కాజేసిన మోసగాడిని సిద్దిపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు.. మేడ్చల్‌ మల్కాజిగిరి

Published : 28 Jan 2022 08:20 IST

కృష్ణా జిల్లాలో నిందితుడిని పట్టుకున్న సిద్దిపేట పోలీసులు

న్యూస్‌టుడే, కొండపాక: సంక్రాంతి పండుగ సమయంలో దోస్తు పేరు చెప్పి రూ.1.22 లక్షలు కాజేసిన మోసగాడిని సిద్దిపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బోయినిపల్లికి చెందిన దానాల సూరజ్‌కు, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్‌ అంబారీ సతీశ్‌కు పరిచయం ఉంది. అతని స్నేహితుల గురించి ఆరా తీశాడు. డీజే బృందంలో సూరజ్‌ పనిచేస్తుంటాడు. అతని అత్తగారి ఊరైన కృష్ణా జిల్లా గుడివాడకు ఈనెల 15న వెళ్లాడు. అదేరోజు అర్ధరాత్రి సతీశ్‌కు ఫోన్‌ చేశాడు. సతీశ్‌కు స్నేహితుడైన అరుణ్‌ తమ్ముడు రాజ్‌కుమార్‌ అని నమ్మకం కలిగేలా పరిచయం చేసుకున్నాడు. తన వద్ద రూ.3 లక్షల విలువైన కెమెరా ఉందని, రూ.1.22 లక్షలు చెల్లిస్తే ఇస్తానని చెప్పి ఒప్పించాడు. మరునాడు గుడివాడలో ఆన్‌లైన్‌ సౌకర్యమున్న కృష్ణా జిరాక్స్‌, ఫ్యాన్సీ సెంటర్‌లోకి వెళ్లి అక్కడికి సొమ్ము పంపించమని సూచించాడు. సతీశ్‌ ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా ఆన్‌లైన్‌లో పంపించారు. డబ్బులు చెల్లించినా కెమెరా మాత్రం సతీశ్‌కు చేరలేదు. తర్వాత మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట పోలీసులు యాదగిరి, కుమార్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి నిందితుడి కోసం గాలించి, పట్టుకొని అరెస్టు చేశారు. సూరజ్‌ రెండేళ్ల క్రితం ముగ్గురు వ్యక్తులను ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకే అని చెప్పి మోసం చేశాడు. అతడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతంలో జైలుకు పంపించారు. గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దని, వాట్సాప్‌, ఫేస్‌బుక్కులో వచ్చే అనుమానిత లింకులపై క్లిక్‌ చేయవద్దని, డిస్కౌంట్ల ప్రకటనల జోలికి వెళ్లొద్దని పోలీసు కమిషనర్‌ శ్వేత ఈ సందర్భంగా సూచించారు. నిందితుడిని గాలించి పట్టుకున్న సిబ్బందికి రివార్డు అందజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని