icon icon icon
icon icon icon

15 సార్లు ఎన్నికలు.. నలుగురే మహిళలు

అతివల్ని ఆకాశంలో సగం అంటూ పొగడటమే తప్ప ప్రజాప్రతినిధులుగా పోటీచేసే అవకాశం కల్పించింది తక్కువే. నర్సాపూర్‌ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.

Updated : 12 Nov 2023 11:47 IST

అతివల్ని ఆకాశంలో సగం అంటూ పొగడటమే తప్ప ప్రజాప్రతినిధులుగా పోటీచేసే అవకాశం కల్పించింది తక్కువే. నర్సాపూర్‌ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. నర్సాపూర్‌ నియోజకవర్గం 1952 ఎన్నికల నాటికి ఆవిర్భవించింది. ఇంతవరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 15 ఎన్నికల్లో మొత్తం నలుగురే మహిళలు పోటీకి నిలిచారు. వీరిలో గెలుపొందింది సునీతారెడ్డి ఒక్కరే కావడం గమనార్హం. ఆమె వరుసగా మూడుసార్లు గెలుపొంది తన ప్రత్యేకతను చాటారు. 1952, 1957, 1962, 1967, 1972, 1978, 1983, 1985, 1989, 1994ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమే లేదు. 1999ఎన్నికల నాటికి అనూహ్యంగా సునీతారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె వరుసగా 1999, 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. 1999, 2004, 2009ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 2009 ఎన్నికల్లో పిరమిడ్‌ పార్టీ అభ్యర్థిగా లక్ష్మి, 2014 ఎన్నికల్లో సీపీఎం తరఫున కండపల్లి లక్ష్మీబాయి, 2018 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి సోమన్నగారి లక్ష్మీ పోటీకి నిలిచారు.

న్యూస్‌టుడే, నర్సాపూర్‌


కల్యాణ వేదిక.. ఎన్నికల వేడిక

తూప్రాన్‌లో ఓ ఫంక్షన్‌ హాల్లో కార్యకర్తల సమావేశం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నాయకులు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. తూప్రాన్‌ మండల కేంద్రంలో ప్రధాన పార్టీల నాయకులు నెల రోజుల పాటు వేడుక మందిరాలను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భారాస, కాంగ్రెస్‌, భాజపా ఇలా మూడు ప్రధాన పార్టీల నాయకులు అక్కడి నుంచే తమ ప్రచారాలను ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం కార్యకర్తలకు, నాయకులకు, ర్యాలీకి వచ్చే ఇతరులకు భోజనాలు పెడుతున్నారు. ఒక్కో ఫంక్షన్‌ హాల్‌ను నెల రోజులకు రూ.ఐదు నుంచి రూ.పది లక్షల వరకు అద్దెకు మాట్లాడుకున్నారు. పట్టణంలో ప్రధాన పార్టీల నాయకులు కార్యకర్తలతో ఫంక్షన్‌ హాల్‌ వద్ద సందడి నెలకొంది.

న్యూస్‌టుడే, తూప్రాన్‌


అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం

మెదక్‌... రాచవీడు ప్రాంతం నుంచి జిల్లా కేంద్రంగా మారింది. 1952లో నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటి వరకు పది మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయా మండలాలు, పట్టణానికి చెందిన వారు కావడంతో అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహించడం విశేషం. 1952లో తొలి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటేశ్వర్‌రావు (కాంగ్రెస్‌) మెదక్‌ పట్టణం బ్రాహ్మణవీధికి చెందిన వారు. తిరిగి ఆయనే 1957లో విజయం సాధించారు. ఆ తర్వాత సీపీఐ తరఫున గెలిచిన ఆనందాదేవి మెదక్‌ పట్టణవాసి. 1967లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంచంద్రారెడ్డి సంగారెడ్డి జిల్లా జోగిపేట స్వస్థలం. ఆ తర్వాత వరుసగా 2004 వరకు జరిగిన ఎన్నికల్లో పాపన్నపేట మండలానికి చెందిన వారు ఎన్నికవుతూ వచ్చారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కరణం రామచంద్రరావుది పాపన్నపేట మండలం కొత్తపల్లి. ఈయన ఇక్కడి నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 1989లో గెలిచిన పట్లోళ్ల నారాయణరెడ్డి, 2004లో జనతా పార్టీ నుంచి గెలుపొందిన పట్లోళ్ల శశిధర్‌రెడ్డిలది పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట. 2002లో జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించిన కరణం ఉమాదేవి స్వగ్రామం కొత్తపల్లి. ఇక చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లికి చెందిన మైనంపల్లి హన్మంతరావు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014, 2018లో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్వస్థలం రామాయంపేట మండలం కోనాపూర్‌.
- న్యూస్‌టుడే, మెదక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img