icon icon icon
icon icon icon

ఈవీఎంలో ఎవరి గుర్తులు ముందుంటాయంటే?

ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామపత్రాల ప్రక్రియ. ఇప్పటికే వీటి స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా బుధవారం ఉపసంహరణ ప్రక్రియ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో జరిగింది. బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.

Updated : 16 Nov 2023 11:30 IST

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామపత్రాల ప్రక్రియ. ఇప్పటికే వీటి స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా బుధవారం ఉపసంహరణ ప్రక్రియ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో జరిగింది. బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఈ గుర్తుల కేటాయింపు, ఈవీఎంలో వివిధ పార్టీల అభ్యర్థుల కూర్పు ఎలా ఉంటుందన్నది చాలా మందికి తెలియదు. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల గుర్తులే సంబంధిత అభ్యర్థులకు ఉంటాయి. రిజిస్టర్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం.. నామపత్రం దాఖలు సమయంలో ప్రాధాన్య క్రమంగా ఎంచుకున్న వాటిని కేటాయిస్తారు. అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి నామపత్రంలో కోరిన వాటిని సూచిస్తూ గుర్తులు కేటాయిస్తారు. వీటిలోనూ ఒకే గుర్తును ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎంచుకుంటే లక్కీ డ్రా విధానం అనుసరిస్తారు.

  • ఈవీఎం(బ్యాలెట్‌ యూనిట్‌)లో అభ్యర్థుల వరుస క్రమాన్ని.. నామపత్రంలో రాసిన పేర్ల తెలుగు అక్షరమాల ప్రకారం కేటాయిస్తారు. అది ఎలాగో చూద్దాం.
  • ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులవి మొదటి వరుసలో.. రిజిస్టర్‌ చేసుకున్నవి, స్వతంత్ర అభ్యర్థులవి తదుపరి వరుస క్రమంలో కేటాయిస్తారు. వాటిలో నామపత్రంలో నమోదు చేసిన పేర్ల తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థులు ముందుగా ఉంటారు.

ఉదా: ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో భాజపా నుంచి అజ్మీరా ఆత్మారాం నాయక్‌, కాంగ్రెస్‌ నుంచి అజ్మీరా శ్యాంనాయక్‌, భారాస నుంచి కోవ లక్ష్మి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి కనక ప్రభాకర్‌.. ఇలా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో ఈవీఎంలో ముందు వరుసలో భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉంటారు. ఇద్దరి ఇంటి పేర్లు ఒక్కటే కావడంతో పేరు ప్రకారం ఆత్మారాం, శ్యాంనాయక్‌లలో తెలుగు అక్షరమాల ప్రకారం ‘ఆ’ మొదట వస్తుంది. కాబట్టి ఆత్మారాం అభ్యర్థి మొదటి స్థానంలో, తర్వాత శ్యాంనాయక్‌  ఉంటారు. భారాస నుంచి కోవ లక్ష్మి,  బీఎస్పీ నుంచి కనక ప్రభాకర్‌లు పోటీలో ఉన్నారు. వీరిలో తెలుగు అక్షరమాల ప్రకారం మొదట ‘క’ తర్వాత ‘కో’ వస్తుంది. కాబట్టి బీఎస్పీ అభ్యర్థి తర్వాత భారాస అభ్యర్థి పేరు ఈవీఎంలో కనిపిస్తుంది. దీని ప్రకారం.. మొదట భాజపా, రెండో స్థానంలో కాంగ్రెస్‌, మూడు బీఎస్పీ, నాలుగో స్థానంలో భారాస అభ్యర్థి ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img