Published : 27 Jun 2022 16:47 IST

Maharashtra Crisis: పెద్దాయన ఊహించారు.. శిందే నిజం చేశారు!

మహారాష్ట్రలో కీలక నేతగా మారిన ఏక్‌నాథ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: మహారాష్ట్రలో శివసేన(Shivsena) పార్టీకి ‘ఠాణె’ కేంద్ర బిందువు అని చెప్పొచ్చు. ఇక్కడే సేన తొలిసారి విజయం సాధించింది. అప్పటినుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. నాలుగు దశాబ్దాలుగా సేనకు ఠాణె కంచుకోటగా మారింది. ఆనంద్‌ దిఘే(Anand Dighe), ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde).. తదితర నేతలు పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. ముంబయితో పోల్చితే ఠాణెలోనే సేన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

తొలితరం నేత ఆనంద్‌ దిఘే..

బాలాసాహెబ్‌(Bala Saheb) ఆశీస్సులతో ఆనంద్‌ దిఘే.. ఠాణెలో సేన నిర్మాణాన్ని పటిష్ఠం చేశారు. హిందుత్వ భావాల విషయంలో ఎప్పుడూ రాజీ పడని దిఘే నేతృత్వంలో సేన స్థానికంగా బలోపేతమైన శక్తిగా ఎదిగింది. అయితే, అగ్రనేత ఠాక్రే తరహాలోనే ఆయన కూడా ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటంతో దిఘేకు ప్రజాదరణ పెరిగింది. ఆయన రాష్ట్రంలో పెద్ద నేతగా ఎదుగుతారని బాల్‌ ఠాక్రే ఊహించారు. అయితే, 2001లో దిఘే ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

దిఘే శిష్యుడే శిందే..

ఆనంద్‌ దిఘే సారథ్యంలో ఏక్‌నాథ్‌ శిందే ఎదిగారు. గురువు దిఘే తరహాలోనే ప్రజలతో సన్నిహత సంబంధాలు, వారి  సమస్యలను తీర్చడం.. తదితర కార్యక్రమాలతో ఠాణె జిల్లాలో ప్రముఖ నేతగా మారారు. కేవలం ఠాణె మాత్రమే కాకుండా పాల్ఘార్‌ జిల్లాలోనూ ఆయన మాట వేదంగా మారింది. సేనలో ప్రముఖ నేతలు నారాయణ్‌ రాణె, రాజ్‌ ఠాక్రేలు వెళ్లిపోయినా.. సేన సభలకు శిందే నేతృత్వంలోనే ప్రజలు భారీగా హాజరయ్యేవారు.

శివసేనకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న శిందేకు.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ఉద్ధవ్ ‘మహా వికాస్‌ అఘాడి’ని నెలకొల్పడం రుచించలేదు. దీంతో సమయం కోసం వేచి చూసి.. తిరుగుబాటు చేశారు. తన గురువు ఆనంద్‌ దిఘే జీవితంపై ‘ధర్మవీర్‌’ అనే మరాఠి సినిమా నిర్మించేందుకు శిందే సాయం చేశారు. ఈ సినిమాను వీక్షించేందుకు ఉద్దవ్‌ ఠాక్రేను ఆహ్వానించారు. కానీ.. సినిమా చివర్లో ఠాక్రే వెళ్లిపోయారు. ఎన్నో ఏళ్లకు ముందే ఆనంద్‌ దిఘే రాజకీయ భవిష్యత్తును సీనియర్‌ ఠాక్రే ఊహించారు. అయితే.. రోడ్డు ప్రమాదంలో దిఘే కన్నుమూశారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని దిఘే శిష్యుడు ఏక్‌నాథ్‌ భర్తీ చేసి.. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా మారడం గమనార్హం.

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts