Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్‌ చేస్తాయా?

సోషలిస్టు నేత, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్‌ రాజకీయాలను మార్చివేసింది.

Updated : 25 Jan 2024 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: సోషలిస్టు నేత, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ (Karpoori Thakur)కు కేంద్రం భారత రత్న (Bharat Ratna) అవార్డు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి తరానికి ఆయన ఎవరో అంతగా తెలియకపోయినా.. 1970, 80ల్లో దేశ సామాజిక రాజకీయాలపై ఎంబీసీ నేతగా ఠాకూర్‌ వేసిన ముద్ర బిహార్‌ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. 1970-71, 1977-1979 వరకు ఆయన బిహార్‌ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

‘కర్పూరీ మేథ్స్‌’ అంటే..

సమాజంలో అట్టడుగువర్గాలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలన్నదే ఈ పథకం. 1978లో బిహార్‌లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ముంగేర్‌లాల్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. దీన్ని ఠాకూర్‌ అమలులోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం బీసీల రిజర్వేషన్లు ఇలా..

  • ఎంబీసీలు 12 శాతం
  • ఈబీసీలు (ఓబీసీల్లోని వారు) 8శాతం
  • మహిళలు 3 శాతం
  • అగ్రవర్ణాల్లో పేదలు 3 శాతం

బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న

ఈ రిజర్వేషన్లు బిహార్‌ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. అప్పటి వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయాధికారాన్ని బీసీలు అందిపుచ్చుకున్నారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ప్రస్తుత సీఎం నీతీశ్‌ కుమార్‌లు ఠాకూర్‌కు శిష్యులే కావడం విశేషం. ఈ రిజర్వేషన్ల అమలుతో దేశంలో బీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది.  దేశవ్యాప్తంగా బీసీల జనాభా గణనకు బిందేశ్వర్‌ మండల్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటైంది. దీన్నే మండల్‌ కమిషన్‌గా వ్యవహరిస్తుంటారు.

నీతీశ్‌ పాలనలో..

2005లో జేడీయూ-భాజపా సంకీర్ణ ప్రభుత్వం నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైంది. కర్పూరీ ఠాకూర్‌ రిజర్వేషన్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ.. మండల్‌, కమండల్‌ అంశాలు దీన్ని మరుగునపరిచాయి. నీతీశ్‌ తిరిగి ఎంబీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. ఆర్జేడీ సారథి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ యాదవ్‌-ముస్లిం ఫార్ములాను ఢీకొనేందుకు ఎంబీసీని నీతీశ్‌ అందుకున్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడినవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో నీతీశ్‌కు అనుకూలమైన ఒక వర్గం ఏర్పడింది. ఇదే ఫార్ములాను దళిత రిజర్వేషన్లలోనూ ప్రవేశపెట్టడంతో జేడీయూ ప్రజాదరణ బాగా పెరిగింది.

భాజపా సైతం..

2020 అసెంబ్లీ ఎన్నికల అనంతరం భాజపా సైతం ఎంబీసీ విధానాన్ని అనుసరించింది.  బిహార్‌లో సంకీర్ణ సర్కారులో భాగంగా డిప్యూటీ సీఎంను ఆ వర్గానికి కేటాయించింది. ఏ రాష్ట్రానికి తగిన విధంగా విధానాలు రూపొందించడం భాజపాకు సాయపడుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఎంబీసీ విధానాన్ని కమలనాథులు బలంగా ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లడం వారి విజయానికి దోహదపడిందని చెప్పవచ్చు.

కులగణనకు పోటీగా..

బిహార్‌లో కుల గణన జరిగింది. దేశవ్యాప్తంగా కులాలను లెక్కించాలన్న డిమాండ్లు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సమాధానంగా ఎంబీసీ అంశాలన్ని భాజపా ప్రవేశపెట్టింది. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. వాస్తవానికి దీన్ని కర్పూరీ ఠాకూర్‌ ఫార్ములా అంటారు. ఆయన శిష్యుడు నీతీశ్‌ అందిపుచ్చుకున్నారు. భాజపా సైతం దీన్ని ప్రయోగిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌ కీలకమే

40 లోక్‌సభ స్థానాలున్న బిహార్‌ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భాజపా ఆశిస్తోంది. గత ఎన్నికల్లో నీతీశ్‌ జేడీయూ, ఎల్‌జేపీలతో పొత్తు పెట్టుకొని మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. అయితే జేడీయూ ఇప్పుడు కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంబీసీ అంశాన్ని కమలనాథులు బయటకు తీశారు. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలనేది కమలనాథుల ఆశయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని