PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు

బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. 

Updated : 09 Feb 2024 18:03 IST

PV Narasimha Rao | ‘మనలో పోరాటశక్తి ఉండాలి... పోరాటం లేకపోతే జీవితమే లేదు’ అని కాంగ్రెస్‌ కార్యవర్గ శ్రేణులకు ఉద్బోధించిన పీవీ, పదవీ రాజకీయాల రణజన్ముడు కాదు- సంస్కరణల పథంలో దేశాన్ని కదం తొక్కించిన కారణజన్ముడు! ‘పదవులు కోరుకోలేదు- వస్తే వద్దనలే’దన్న పీవీ, దశాబ్దాల ప్రజాజీవన యానంలోని ప్రతి కీలక మలుపుపైనా తనదైన ముద్ర వేసిన దార్శనికుడు! పదహారు భాషలు పుక్కిట పట్టిన పీవీ, పదహారణాల అచ్చ తెనుగు ఠీవి. సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా అనంతపురంలో ఆరుబయలు జైలు నెలకొల్పడం, అనంతర కాలంలో ఆరోగ్యమంత్రిగా ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసుపై వేటు, దేవాదాయ శాఖమంత్రిగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం, విద్యామంత్రిగా ఆదర్శ పబ్లిక్‌ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం వంటివన్నీ పాములపర్తివారి సంస్కరణల్లో కొన్ని! ముఖ్యమంత్రిగా భూ పరిమితి చట్టం ప్రవేశపెట్టి తన వందల ఎకరాల భూముల్నీ ధారాదత్తం చేసిన ఆదర్శం నిరుపమానమైనది. 

1991లో రాజకీయ వానప్రస్థానానికి సిద్ధమవుతున్న వేళ- రాజీవ్‌ దుర్మరణంతో శోకాకులమైన కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా, సంక్షుభిత దేశాన్ని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాల్సిన మైనారిటీ సర్కారు సారథిగా పీవీ ప్రజ్ఞాపాటవాలు త్రివిక్రమావతారం దాల్చాయి. 1947లో రాజకీయ స్వాతంత్య్రం పొందిన భారతావని లైసెన్స్‌ పర్మిట్‌ రాజ్‌ శృంఖలాల్లో చిక్కి దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఛిద్రమైన దేశ ఆర్థిక వ్యవస్థకు- ఆ సంకెళ్లు తెంచి సంస్కరణల నవశకానికి నాందీ వాచకం పలికింది పీవీ! దశాబ్దాల పాటు పేరుకు పోయిన చెత్తను ఊడ్చేయడం ఒక్క దఫా పాలనలో సాధ్యపడదనే నేతాగణాలకు భిన్నంగా- పట్టుమని అయిదేళ్లలోనే పీవీ దిద్దిన సంస్కరణల ఒరవడి, కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా మూడు దశాబ్దాలుగా శిరోధార్యం అవుతూనే ఉంది. నవ చైనా నిర్మాత డెంగ్‌ జియావో పింగ్‌కు దీటైన దూరదృష్టితో భారతావని భాగ్యరేఖల్ని లిఖించిన పీవీ శతవసంత సంస్మరణం- ఎంతటి సంక్షోభాల్ని అయినా ఎదుర్కొనే స్థితప్రజ్ఞతా స్ఫూర్తి రగిలించాలి!

అపర మేధావి.. ఆర్థిక సంస్కరణల ధీశాలి

‘దేశం నీకేమిచ్చిందని కాదు, దేశానికి నువ్వేం చేశావన్నదే ప్రధాన’మంటూ ఆరు దశాబ్దాల నాడు జాన్‌ ఎఫ్‌ కెనెడీ చేసిన మేలిమి వ్యాఖ్యే ప్రామాణికమైతే- పీవీ, భరతమాత రుణం తీర్చుకొన్న ధన్యజీవి. సహస్ర చంద్రోదయాలు చూసిన వ్యక్తిగా పీవీ జీవితం పరిపూర్ణం. గోవింద వల్లభ పంత్‌, కేఎం మున్షీల కోవకు చెందిన మనీషిగా ఆయన వ్యక్తిత్వం పరిమళభరితం! పీవీ ప్రధానిగా పగ్గాలు చేపట్టేనాటికి ద్రవ్యలోటు జీడీపీలో తొమ్మిది శాతానికి, ద్రవ్యోల్బణం పదహారు శాతానికి ఎగబాకగా- అంతర్జాతీయంగా ఇండియా పరపతి రేటింగ్‌ పాతాళానికి దిగజారి ఉంది. పంజాబ్‌ కశ్మీర్‌ ఈశాన్యంలో ఉగ్రవాద సెగలు, దేశమంతా మందిర్‌ మసీదు గొడవలు, దిగుమతుల చెల్లింపులకూ దిగాలు పడిన వైనం, సోవియట్‌ యూనియన్‌ కాలగర్భంలో కలిసిపోయిన నేపథ్యం... ఇవన్నీ పెను సవాళ్లుగా కళ్లకు కట్టినవే! 

1991లో 26,600 కోట్ల డాలర్లుగా ఉన్న భారత జీడీపీ నేడు దాదాపు 272.41 లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్నా అది పీవీ- మన్మోహన్‌ సింగ్‌ ద్వయం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితమే..! కశ్మీర్‌, పంజాబ్‌ల్లో ఎన్నికల నిర్వహణ ద్వారా ఉగ్రవాదానికి ‘చెక్‌’ పెట్టగలిగిన చాణక్యం, ఇండియాను అణుశక్తి సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దడానికి సకలం సిద్ధం చేసిన పౌరుషం, ఇజ్రాయెల్‌తో ఇండియా రక్షణ బాంధవ్యం కుదుర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అరాఫత్‌తోనే ప్రకటన చేయించగల దౌత్య ధురీణత, ‘లుక్‌ ఈస్ట్‌’ విధానం ద్వారా తూరుపు వాకిలి తెరచిన చతురత- పీవీ అసమాన రాజనీతిజ్ఞతకు తిరుగులేని ఆనవాళ్లు. స్వాతంత్య్రానంతర కాంగ్రెస్‌వాది అయినా స్వాతంత్య్రానికి ముందునాటి విలువలున్న వ్యక్తిగా పీవీని నాటి కమలదళాధిపతి ఎల్‌కే అడ్వాణీయే కొనియాడారు. అలాంటి తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం ద్వారా దేశం తనను తాను సత్కరించుకున్న అపూర్వ క్షణమిది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని