శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?

కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.

Updated : 24 Jan 2024 20:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: భూమిపై ఉన్న కోట్లాది పక్షులు, కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవుల జీవన విధానం విచిత్రంగా ఉంటుంది. నిత్యం ప్రకృతితో ఎదురీదుతూ తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ వ్యూహాలను అనుసరిస్తుంటాయి. అయితే వీటికి వచ్చే ప్రమాదాల్లో ముఖ్యమైనది శీతాకాలమే (Winter). ఈ రుతువులో గడ్డకట్టించే చలితో పాటు ఆహారం దొరకదు. ప్రత్యేకించి ఉత్తరార్ధగోళంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

మంచుకు భయపడి ప్రయాణం

ఉత్తరార్ధగోళంలో మంచుసీజన్‌ను పక్షులతో పాటు పలు క్షీరదాలు ముందే గ్రహిస్తాయి. దీంతో వేడిగా ఉండే దక్షిణార్ధగోళానికి ప్రయాణిస్తాయి. అక్కడే ఉండి మంచు సీజన్‌ ముగిసి వసంతం ప్రారంభమయ్యాక తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటాయి. ఇక దక్షిణ ప్రాంతంలో ఉండే జీవాలకు మరో సమస్య ఉంటుంది. ఇవి ఎప్పుడూ ఉష్ణవాతావరణానికి అలవాటుపడి ఉంటాయి. ఉష్ణోగ్రతలు తగ్గిన సమయంలో ఈ పరిస్థితులను తట్టుకునేందుకు సిద్ధమవుతాయి.

ముందుగానే సిద్ధం

మరికొన్ని జీవులు పగటి కాలం తగ్గడంతో శీతాకాలం ఆగమనాన్ని గుర్తిస్తాయి. దీంతో తమ జీవక్రియ చర్యను తగ్గిస్తాయి. ఈ సమయంలో తమలో ఉన్న కొవ్వు పదార్ధాలతో సుదీర్ఘకాలం జీవించేందుకు వీలుగా కొత్త జీవన విధానాన్ని అలవరుచుకుంటాయి. కొన్ని రకాల పురుగులు తమ శరీరాల్లోని నీటిని వదిలివేస్తాయి. నీరు ఉంటే గడ్డ కట్టుకునే ప్రమాదముంది. నీటికి బదులుగా గ్లైసరొల్‌ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనం సుదీర్ఘకాలం పాటు చలిని అడ్డుకుంటుంది.

ప్రాణాలు వదిలి..

ఇక ముఖ్యమైన అంశాన్ని చూస్తే కొన్ని పురుగులు గుడ్లు పెట్టిన తరువాత లేదా ప్యూపా, లార్వా దశలో తమ సంతానం ఉండగా తమ ప్రాణాల్ని వదలిపెడుతాయి. అప్పటికీ మంచు దట్టంగా పరుచుకొని ఉంటుంది. మరో రుతువు వచ్చే సమయానికి  పిల్లలు చైతన్య దశలోకి వస్తాయి. ప్రకృతి విసిరే పెనుసవాళ్లను కోట్లాది చిన్న చిన్న జీవులు ఇలా అధిగమిస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని