Nitish Kumar: మళ్లీ జంప్‌..! ఎందుకంటే..?

బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Updated : 27 Jan 2024 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: బిహార్‌ రాజకీయాలు మళ్లీ శరవేగంగా మారుతున్నాయి. సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే అధికారుల మార్పిడి, సిబ్బంది బదిలీలు జరగడంతో.. మహాకూటమి నుంచి బయటకు వచ్చి, తిరిగి భాజపా (BJP) మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆయన ఇలా కూటములు మార్చడం ఇది తొలిసారి కాదు. అయితే, లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యం, విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

నీతీశ్‌ మనసులో ఏముందో..!: ఖర్గే

బిహార్‌ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. బిహార్‌లో బీసీల రిజర్వేషన్లు, కేటగిరీల వారీగా కేటాయించడం.. తదితర అంశాలు కర్పూరీ ఠాకూర్‌తో ఆ రాష్ట్ర రాజకీయాల్లో మేరునగ శిఖరంగా పేరు వచ్చింది. ఠాకూర్ పంథాను నీతీశ్‌ అందిపుచ్చుకున్నారు. ఎంబీసీలతో పాటు ఎస్సీల్లోనూ అత్యంత వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయా వర్గాల్లో పట్టు సాధించారు. ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో ఎంబీసీల మన్నన పొందేందుకు భాజపాకు అవకాశం వచ్చింది. దీంతో జేడీయూ అధినేత వెంటనే తన వైఖరి మార్చుకొని తిరిగి కమలదళానికి మద్దతు ప్రకటించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

‘ఇండియా కూటమి’లో పొసగకపోవడం

విపక్షాల కూటమి ‘ఇండియా’లో నీతీశ్‌కుమార్‌ది ప్రధాన భూమిక. కొంతకాలంగా ఆయన కూటమి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్‌పై అపనమ్మకం కలిగింది. కూటమికి ఆయనను కన్వీనర్‌గా ప్రకటించాలన్న నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ వాయిదా వేయాలని కోరారు. బిహార్‌ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సైతం ఈ నిర్ణయంపై తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీ సమ్మతి కావాల్సిందేనని పట్టుబట్టారు. వీటితో విసిగిపోయి కూటమి నుంచి వైదొలగి భాజపా కూటమి వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

లాలన్‌సింగ్‌ వ్యవహారం

పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్‌రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లాలన్‌సింగ్‌ను నీతీశ్‌ తొలగించి ఆ పదవీ బాధ్యతలు తాను తీసుకున్నారు. వాస్తవానికి సీఎం పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు తేజస్వీకి అప్పగించాలని లాలన్‌ సూచించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆర్జేడీకి మద్దతు తెలిపేందుకు పార్టీని చీల్చాలని లాలన్‌ యోచించినట్టు సమాచారం. వీటిని తెలుసుకున్న నీతీశ్‌ ముందుగా చెక్‌పెట్టారు. వాస్తవానికి మహాకూటమిలో ఆర్జేడీ 79, జేడీయూ 45, కాంగ్రెస్‌ 19, సీపీఎం ఎల్‌ 12, సీపీఐ 2, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. జేడీయూకు సంఖ్యా బలం తక్కువైనా సీఎం పదవి దక్కడం విశేషం.

లోక్‌సభ ఎన్నికలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పార్టీ ప్రాభవం తగ్గే అవకాశాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 45 సీట్లు మాత్రమే రావడం గమనార్హం. రాష్ట్రంలో భాజపా గణనీయశక్తిగా ఎదుగుతోంది. ఆర్జేడీ, ఇండియా కూటమి వైఖరితో విసిగిపోయిన నీతీశ్‌ తిరిగి భాజపా కూటమికే మొగ్గుచూపుతుండటంతో బిహార్‌ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. 40 లోక్‌సభ సీట్లు ఉన్న బిహార్‌ హిందీ బెల్ట్‌లో కీలకమైనది. అందుకనే కమలనాథులు ఈ రాష్ట్రంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని