PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. 

Updated : 09 Feb 2024 18:59 IST

PV Narasimha Rao | మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు జీవితంలో ఎక్కువ మందికి తెలియని మరో పార్శ్వం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలోనూ ఉన్నత స్థానానికి చేరుకున్నారాయన. దివంగత ప్రధాని రాజీవ్‌ నుంచి పీవీకి రాజకీయ ప్రోత్సాహం ఆగిపోయింది. 1990 ద్వితీయార్ధంలో  పీవీ అమెరికాలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వచ్చారు. రాగానే ఆయనకు కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠం నుంచి సందేశం వచ్చింది. తమిళనాడులో ఆ పీఠం ఉంది. ఆదిశంకరాచార్య సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్థాపించిన పీఠమది. ఆ ఆశ్రమాన్ని పీవీ తరచూ సందర్శిస్తుండేవారు. అక్కడి సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ పీఠాధిపతి అయిన మౌనస్వామి శివసాయుజ్యం పొందాక ఆయన వారసుడి కోసం ఆశ్రమం అన్వేషించింది. పీవీయే ఇందుకు తగిన యోగ్యుడని ఆశ్రమం భావించి సందేశం పంపింది. అప్పటికి పీవీ ఆ ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించలేదు. అలాగని తిరస్కరించనూ లేదు.

తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు

1991 ఎన్నికల్లో పీవీకి టికెట్‌ ఇవ్వకూడదని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ మేనిఫెస్టో బాధ్యతలు అప్పగించింది. ఇక రాజకీయ జీవితం ముగించాల్సిన సమయం వచ్చిందని పీవీ నరసింహారావు భావించారు. కుర్తాళం పీఠం బాధ్యతలు స్వీకరించడానికి దాదాపుగా సిద్ధమయ్యారు. 1990లో పీఠం వారు పంపిన ఆహ్వానాన్ని అంగీకరించే దిశగా ఆలోచిస్తున్నట్లు సందేశం పంపారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరగవు. 1991 మే 21న రాజీవ్‌గాంధీ.. హత్యకు గురయ్యారు. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి నిరాకరించారు. ఎంతో మంది ఉద్ధండులు పోటీ పడినా సొంత వర్గమంటూ లేని పీవీకి పగ్గాలు అప్పచెప్పడానికి సోనియా మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించినా సాధారణ మెజారిటీకి దూరంగానే ఉంది. ప్రధాని పదవికీ పలువురు నేతలు పోటీ పడినా చివరికి సోనియా పీవీవైపే మొగ్గు చూపారు. ఆయన సారథ్యంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత అంతా చరిత్రే.

పట్టుదలతో కోడ్‌ రాశారట!

అది 1985... రాజీవ్‌ ప్రధానిగా కొత్త కోటరీని ఏర్పాటు చేసుకుంటున్న దశ...ఓ రోజు రక్షణ మంత్రి పీవీ సమక్షంలో... రాజీవ్‌గాంధీ తన స్నేహితుడితో (బహుశా శ్యాంపిట్రోడా) సంభాషిస్తున్నారు. ‘‘కంప్యూటర్ల దిగుమతులపై మనం సుంకాలను తగ్గించాలి. కానీ నా కేబినెట్‌లోని ముసలివాళ్ళకు కంప్యూటర్లంటే అర్థం కావటం లేదు’’ అంటూ మాట్లాడారట! ఇంటికి వెళ్ళిన వెంటనే పీవీ తన కుమారుడు ప్రభాకర్‌రావుకు ఫోన్‌ చేసి... కంప్యూటర్‌ ఒకటి పంపమన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన కంప్యూటర్‌ పంపించారు. పీవీ కంప్యూటర్‌ నేర్చుకోవటానికి ఓ మాస్టారును నియమించుకున్నారు. కొద్దిరోజుల్లోనే... దరియాగంజ్‌కు వెళ్ళి వివిధ కంప్యూటర్‌ భాషల పుస్తకాలు కొనితెచ్చుకోవటం మొదలెట్టారు. మరికొద్ది వారాల్లోనే ఆ మాస్టారిని కూడా మాన్పించేశారు. ఏడాది తిరిగేసరికి... బేసిక్‌, కోబాల్‌ లాంగ్వేజీలపై పట్టు సంపాదించి... యూనిక్స్‌లో కోడింగ్‌ మొదలెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని