ఉమోజా.. ఈ ఊరిలో ఉండేవాళ్లంతా మహిళలే!

వారంతా అత్యాచారాలకు, వేధింపులకు గురైన మహిళలు. ఆదరించాల్సిన భర్తలు ఏలుకోము పొమ్మనడంతో రోడ్డున పడ్డ అభాగ్యపు భార్యలు. కట్టుకున్నవాడు కాదనడంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. పురుషులపై నమ్మకం కోల్పోయారు. చావే శరణ్యమనుకున్నారు. కానీ, ఓ మహిళ వారికి

Updated : 08 Feb 2021 04:35 IST

వారంతా అత్యాచారాలకు, వేధింపులకు గురైన మహిళలు. ఆదరించాల్సిన భర్తలు పొమ్మనడంతో రోడ్డున పడ్డ అభాగ్యులు. కట్టుకున్నవాడు కాదనడంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. పురుషులపై నమ్మకం కోల్పోయారు. చావే శరణ్యమనుకున్నారు. కానీ, ఓ మహిళ వారికి ధైర్యం చెప్పింది. పురుషుడి అండ లేకుండా బతికి చూపించాలని హితబోధ చేసింది. దీంతో బాధిత మహిళలంతా కలిసి ఏకంగా ఊరు నిర్మించారు. పురుషులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. నివాసాలు ఏర్పాటు చేసుకొని సొంతకాళ్లపై నిలబడ్డారు. ఆ తర్వాత కూడా వారిపై దాడులు, వేధింపులు ఆగలేదు. అయినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉనికిని చాటుకుంటున్నారు. వారే.. సంబురు తెగ మహిళలు. వారు ఉంటున్నది ఉమోజా ఉసో గ్రామం. ప్రస్తుతం ఇది పురుషులు లేని గ్రామంగా విశిష్టతను సంపాదించుకుంది. 

ఎక్కడుందీ గ్రామం?

కెన్యాలోని సంబురు కౌంటీలో ఉందీ ఈ గ్రామం. ఇక్కడ పదుల సంఖ్యలో గుడిసెలు నిర్మించుకొని మహిళలు జీవిస్తున్నారు. అవి కూడా కర్ర, మట్టి, ఆవు పేడ, గడ్డి ఉపయోగించి నిర్మించిన నివాసాలు. గుడిసె చుట్టూ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో నివసిస్తున్న 50 మంది మహిళలు నిత్యం సంప్రదాయ దుస్తులనే ధరిస్తుంటారు. వారి పిల్లలూ ఇక్కడే జీవిస్తున్నారు. అమ్మాయిలతే వీరితోనే జీవితాంతం ఈ ఊరిలోనే ఉండొచ్చు. అబ్బాయిలతే 18ఏళ్లు వచ్చే వరకు తల్లుల వద్ద పెరగొచ్చు. 18 ఏళ్లు దాటితే గ్రామం వదిలి మరో చోటకు వెళ్లిపోవాల్సిందే.

ఎలా ఆవిర్భవించింది?

మూడు దశాబ్దాల కిందటే ఈ గ్రామం ఏర్పడింది. అప్పట్లో సంబురు తెగ ప్రజల్లో పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. మహిళలంటే చిన్నచూపు. ఆడవాళ్లు కేవలం పిల్లలను కనే యంత్రాలు, బానిసలు అని భావించేవారు. మహిళలకు సొంతంగా ఎలాంటి హక్కులు, ఆస్తులు ఉండవు. కనీసం జంతువులను పెంచుకునే స్వేచ్ఛ కూడా ఉండదు. బలవంతపు వివాహాలు, గృహహింస అక్కడ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో సంబుర తెగ మహిళలు జీవితం కొనసాగించారు. అయితే, ఓ ఘటన వీరి జీవితాల్ని మరో మలుపు తప్పింది.. అదే ఈ గ్రామం ఏర్పాటుకు దారి తీసింది.

మూడు దశబ్దాల కిందట సంబురు తెగకు చెందిన 1400 మందికిపైగా మహిళలపై సైనికులు అత్యాచారం చేశారట. ఈ ఘటనపై కేసు నమోదైంది. కానీ, కోర్టులో కేసు నిలబడలేదు. అత్యాచారానికి గురి కావడంతో బాధితులను వారి భర్తలు ఇంట్లో నుంచి గెంటేశారు. మరోవైపు తెగలో మహిళలు దాడులు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి మహిళలందరి కోసం ఆ తెగకే చెందిన రెబెకా లొలొసొలికి ప్రత్యేకంగా గ్రామం ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆమె కూడా భర్త చేతిలో హింసకు గురైన మహిళే. వేధింపులు భరించలేక భర్తకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే పురుషులు లేని గ్రామం నిర్మించుకోవాలని భావించింది. అలా 1990లో రెబెకాతోపాటు మరో 15 మంది గుడిసెలు కట్టి ఊరును నిర్మించారు. నిరాశ్రయులైన మహిళల్ని ఆహ్వానించారు. పురుషులను మాత్రం గ్రామంలో అడుగుపెట్టనివ్వలేదు. ఊరంతా కలిసికట్టుగా ఉంటోంది. అందుకే ఈ గ్రామానికి ఉమోజా అని పేరు పెట్టారు. స్వాహిలి భాషలో ఉమోజా అంటే ‘ఐక్యత’అని అర్థం. 

జీవనోపాధి?

ఉండటానికి ఇల్లు సరే.. బతకడానికి ఎలా అని ఆలోచించిన మహిళలు మొదట కూరగాయలను మార్కెట్లో కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్మేవారు. కానీ, పోషణకు సరిపడా డబ్బులు ఈ వ్యాపారంతో రావట్లేదని గ్రహించారు. అందుకే సంప్రదాయ వస్తువులు, ఆభరణాలు తయారు చేసి కెన్యా సందర్శనకు వచ్చే పర్యటకులకు విక్రయించడం ప్రారంభించారు. వీరి ఆలోచన.. కళా నైపుణ్యం మెచ్చిన కెన్యా వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌ వారికి చేయూత నిచ్చింది. వారు తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటోంది. అలాగే కెన్యాస్‌ హెరిటేజ్‌ అండ్‌ సోషల్‌ సర్వీస్‌, కెన్యా సాంస్కృతిక శాఖ నుంచి కూడా వీరికి సాయం అందుతోంది. పేదరికాన్ని, పురుషాధిక్యతను అణచివేస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు వైపు ఈ ఉమోజా గ్రామ మహిళలు అడుగులు వేస్తున్నారు. అత్యాచారానికి గురైన మహిళలతోపాటు లైంగిక వ్యాధులతో బాధ పడుతున్న మహిళలు, హెచ్‌ఐవీ సోకిన.. అనాథ పిల్లలకు సైతం ఈ గ్రామంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక ఆశ్రమాలు, చిన్నారుల కోసం ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. ఇక్కడ కనీసం 200 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మహిళలు తమ ఆదాయంలో పది శాతం డబ్బును గ్రామానికి పన్నుగా కడుతుంటారు. అలా వచ్చిన డబ్బుతోనే పాఠశాల నిర్వహణ, ఇతర అవసరాలు తీర్చుస్తున్నారు.

బెదిరింపులు.. దాడులు

గ్రామం ఏర్పాటు ఆలోచన చేసిన రెబెకానే ఈ గ్రామానికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ విషయమైనా ఊర్లో మహిళలంతా ఒక్కచోటకు చేరి చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఆత్మగౌరవంతో ఉన్నతంగా జీవిస్తున్న ఈ మహిళలను చూసి ప్రపంచం ప్రశంసించింది. 2005లో రెబెకా ఐక్యరాజ్యసమితిని సందర్శించడంతో వీరి ఖ్యాతి మరింత పెరిగింది. దీంతో పొరుగు గ్రామాల్లో ఉండే సంబురు తెగ పురుషుల్లో అహం దెబ్బతింది. ఉమోజా గ్రామాన్ని మూసివేయాలని కోర్టులో కేసు వేశారు. కానీ, దాన్ని కోర్టు కొట్టివేసింది. 2009లో రెబెకా మాజీ భర్త ఊరిపై దాడి చేశాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా వీటికి ఆ మహిళలు జంకకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అక్కడి మహిళలు సొంత భూముల్ని కలిగి ఉన్నారు. స్వేచ్ఛగా జీవిస్తూ అంతర్జాతీయ వేదికలపై తమ కళలను, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మహిళలు తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని