Angada Kanhar: 58 ఏళ్ల వయసులో.. పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే..

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఓ ఎమ్మెల్యే. 58వ ఏట పదో తరగతి పరీక్షలు రాసి.. తన దీర్ఘకాల కలను నెరవేర్చుకున్నారు.......

Published : 29 Apr 2022 19:39 IST

భువనేశ్వర్‌: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఓ ఎమ్మెల్యే. 58వ ఏట పదో తరగతి పరీక్షలు రాసి.. తన దీర్ఘకాల కలను నెరవేర్చుకున్నారు. ఒడిశాలోని ఫుల్బానీకి చెందిన బిజూ జనతా దళ్ (BJD) శాసనసభ్యుడు అంగద కన్హర్ శుక్రవారం పదో తరగతి పరీక్ష రాశారు. 1980లోనే కన్హర్ తన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినప్పటికీ.. పదో తరగతి పూర్తి చేయాలని ఎప్పుడూ భావించేవారు. ఈ క్రమంలోనే బోర్డు ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(బీఎస్​ఈ) నిర్వహిస్తోన్న హైస్కూల్​ వార్షిక పరీక్షలకు శుక్రవారం హాజరయ్యారు. కంధమాల్ జిల్లా పితాబరి గ్రామంలోని రుజంగీ ఉన్నత పాఠశాలలో 67 మంది విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పదో తరగతి పరీక్ష రాశారు. ఆయన హాజరైన పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

‘కుటుంబ సమస్యల కారణంగా పాఠశాల వయసులో పదో తరగతి పరీక్షకు హాజరు కాలేకపోయాను. 1980లోనే నా చదువును ఆపేయాల్సి వచ్చింది. కానీ ఏళ్లు గడిచేకొద్దీ.. నాతోటి వారు, నా కంటే పెద్దవారు ఎంతో కష్టపడి చదువులు పూర్తిచేశారని కథలుకథలుగా విన్నాను. సంకల్పం ఉంటే.. చదువును ఏ వయసులోనైనా పూర్తి చేయొచ్చని గుర్తించా. పరీక్షకు హాజరై నా చదువు పూర్తిచేయాలనేది నా కోరిక. కానీ అందుకు కాస్త భయపడ్డా. కానీ నా కుటుంబసభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలు, అందరూ నన్ను ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే ఈ పరీక్ష రాయగలిగా’ అని పరీక్ష అనంతరం ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని