10లక్షల మందికి అవగాహన కల్పించాం:డీజీపీ

మహిళలతో పాటు ఆడపిల్లల సైబర్‌ భద్రతే లక్ష్యంగా ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమం చేపట్టామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్‌ ముగింపు సందర్భంగా ....

Published : 31 Aug 2020 20:02 IST

అమరావతి: మహిళలతో పాటు ఆడపిల్లల సైబర్‌ భద్రతే లక్ష్యంగా ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమం చేపట్టామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్‌ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడారు. ప్రస్తుత కరోనా కాలంలో ఆన్‌లైన్‌ వేదికను విస్తృతంగా వినియోగిస్తున్న పరిస్థితుల్లో సైబర్‌ భద్రతకు పెద్దపీట వేశామన్నారు. ఆడపిల్లలకు ఏ ఇబ్బంది వచ్చినా పోలీసు వ్యవస్థ వెంటనే స్పందించేలా ‘దిశ’ చట్టంతో ఇప్పటికే ముందడుగు వేసినట్లు వివరించారు. ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమం ద్వారా సైబర్‌ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 10లక్షల మందికి అవగాహన కల్పించినట్లు డీజీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి సమంత, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌, క్రికెటర్‌ కల్పనతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. 

ప్రజలను చైతన్య పరచడం మంచి పరిణామం: సమంత

చిన్నారులు, మహిళలపై జరుగుతున్న సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని ప్రముఖ సినీనటి సమంత అన్నారు. ముగింపు కార్యక్రమంలో వెబినార్‌ ద్వారా ఆమె పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌, స్టాకింగ్‌లాంటి వేధింపులు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా నెలరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచడం మంచి పరిణామమన్నారు.  

మహిళలపై జరుగుతున్న సైబర్‌ వేధింపులపై ఈ-రక్షాబంధన్‌లో చక్కగా వివరించారని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌, క్రికెటర్‌ కల్పన అన్నారు. మారుమూల ప్రాంతాల యువతులు, చిన్నారులు, మహిళలు ఈ కార్యక్రమాన్ని వీక్షించటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కరోనా సమయంలో ఇంట్లో ఉంటూ నిత్యం పాఠశాల తరగతుల్లోలాగే ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని వీక్షించారన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ న్యూస్‌లను గుర్తించటం, డిజిటల్ అడిక్షన్, ఎటువంటి వీడియోలను డౌన్ లోడ్ చేయాలి తదితర అంశాలపై సైబర్‌ నిపుణులు అవగాహన కల్పించారని విద్యార్థినులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని