ఆ కేసు విచారణలో ముందుకెళ్లొద్దు:ఏపీ హైకోర్టు

ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ దాఖలు

Updated : 07 Sep 2020 18:38 IST

అమరావతి: ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ ప్రక్రియలో ముందుకెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌, అందులో పనిచేస్తున్న ఉద్యోగులను వేధించడానికి కేసు నమోదు చేశారంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్విని కుమార్‌ వాదనలు వినిపించారు. కేసు నమోదు ద్వారా ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్నారు. 

ఎన్నికల సంఘం సిబ్బంది వినియోగించిన కంప్యూటర్‌లోని సమాచారాన్ని సీఐడీ అధికారులు తీసుకెళ్లారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పనిచేయకుండా ఉన్న కంప్యూటర్‌ను ఫార్మాట్‌ చేసినందుకు సాంబమూర్తి అనే ఉద్యోగిని సీఐడీ వేధిస్తోందని చెప్పారు. తీసుకెళ్లిన వస్తువులను తిరిగి అప్పగించేలా సీఐడీని ఆదేశించాలని కోర్టును కోరారు. సీఐడీ కేసు నమోదు చేసిన వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ .. ఎవరిపై కేసు నమోదు చేశారు ? ఎవరిని విచారిస్తున్నారు అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కేసు విచారణ ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది . 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని