16 లక్షల లడ్డూలు పంచనున్న రామమందిరం ట్రస్టీ

శుభకార్యాలకు లడ్డూలు పంచుకోవడం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో

Updated : 01 Aug 2020 12:04 IST

శరవేగంగా సాగుతున్న భూమిపూజ పనులు

లఖ్‌నవూ: శుభకార్యాలకు లడ్డూలు పంచుకోవడం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పురస్కరించుకొని భారీ స్థాయిలో లడ్డూలు పంచేందుకు రామమందిరం ట్రస్టీ సిద్ధమైంది. మందిరం భూమిపూజను పురస్కరించుకొని దిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు బికనీర్‌ లడ్డూలను పంపనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ పేర్కొంది. అయోధ్యలో సైతం ఈ స్వీట్లను పంచనున్నారు. 4 లక్షల ప్యాకెట్ల లడ్డూల తయారీకి లఖ్‌నవూ, దిల్లీలో ఆర్డర్‌ ఇచ్చినట్లు ఓ ట్రస్టు అధికారి వెల్లడించారు. ఒక్కో ప్యాకెట్‌లో 4 లడ్డూలు ఉంటాయి.

అయోధ్యలో రామమందిరం భూమిపూజ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర పర్యాటక విభాగం సైతం ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గత శనివారం రామమందిరం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. 500 ఏళ్ల పోరాటం తర్వాత ఈ పవిత్ర గడియలు వచ్చాయని, ఈ రోజులను దీపావళి పండగలాగ నిర్వహించాలని సాధువులతో జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. భూమిపూజ రోజున అయోధ్య నగరవాసులంతా తమ ఇళ్లలో మట్టి దీపాలను వెలిగించాలని యోగి ఈ సందర్భంగా కోరారు. 

భూమిపూజను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆగస్టు 3వ తేదీ నుంచే అయోధ్యలో దీపావళి మొదలవుతుందని అయోధ్య సంత్‌ సమితి అధ్యక్షుడు మహంత్‌ కన్హయ్య దాస్‌ పేర్కొన్నారు. భజనలు, భక్తి కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు.  కరోనాను దృష్టిలో ఉంచుకొని అన్ని కార్యక్రమాల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని