Viral pic: అమ్మా.. నీ త్యాగానికి ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా..?

ఎన్నటికీ తడారని జీవనది.. అమ్మ ప్రేమ. తన బిడ్డ బాగు కోసం తన గమనాన్ని, గమ్యాన్ని మార్చుకోవడానికి వెనకాడదు. మధ్యలో కష్టాలెన్ని ఎదురైనా.. తన నడకను మాత్రం ఆపదు.

Published : 12 May 2022 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎన్నటికీ తడారని జీవనది.. అమ్మ ప్రేమ. తన బిడ్డ బాగు కోసం తన గమనాన్ని, గమ్యాన్ని మార్చుకోవడానికి వెనకాడదు. మధ్యలో కష్టాలెన్ని ఎదురైనా.. తన నడకను మాత్రం ఆపదు. కట్టలు తెంచుకునే ఆవేదన ఉన్నా.. చల్లటి స్పర్శతో తన మాతృప్రేమను పంచడం మాత్రం మానదు. ఈ అమ్మకు ప్రత్యేకించిన రోజే.. మదర్స్‌డే.  

దేశసేవ చేసే అవకాశం దక్కడం ఎంత అదృష్టమో.. అంతే దినదిన ప్రాణగండం కూడా. అలా ఓ తల్లి తన కుమారుడు సరిహద్దులో దేశాన్ని కాచే ఉద్యోగంలో చేరినందుకు ఆనందపడింది. నచ్చిన ఉద్యోగంలో చేరినందుకు సంతోషించింది. కానీ, ఆ బిడ్డ విధులకు వెళ్తుంటే మాత్రం తల్లడిల్లిపోయింది. తిరిగి వస్తాడో లేదో తెలియని సందిగ్ధంతోనే నవ్వుతూ వీడ్కోలు పలికి, తలుపు మాటున కన్నీటి పర్యంతమైంది. లెఫ్టినెంట్ జనరల్‌ సతీశ్‌ దువా షేర్‌ చేసిన చిత్రంలో సరిగ్గా ఇదే భావన స్ఫురిస్తోంది. ‘30 ఏళ్ల క్రితం నేను నా తల్లిని కోల్పోయాను. ప్రతి సైనికుడి తల్లిలో తనను చూసుకుంటున్నాను. నా మాతృభూమి స్పర్శలో తనను స్మరించుకుంటున్నాను. అమ్మా నీకు వందనం’ అంటూ ఆయన ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ‘త్యాగానికి ఇంతకు మించిన అర్థం ఉంటుందా..?’, ‘హృదయం ద్రవిస్తోంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని