MUlugu: జంపన్న వాగులో గల్లంతైన మొత్తం 8మంది మృతదేహాలు లభ్యం

ములుగు జిల్లాలో వరదల్లో గల్లంతైన వారిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏటూరునాగారం మండలం కొండాయిలో ఉన్న జంపన్న వాగులో గురువారం ఎనిమిది మంది గల్లంతయ్యారు.

Updated : 28 Jul 2023 17:39 IST

ఏటూరునాగారం: ములుగు జిల్లాలో వరదల్లో గల్లంతైన వారిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏటూరునాగారం మండలం కొండాయిలో ఉన్న జంపన్న వాగులో గురువారం ఎనిమిది మంది గల్లంతయ్యారు. శుక్రవారం ఉదయం తాడ్వాయి మండలం మేడారం వద్ద వరదలో ఐదుగురి మృతదేహాలు గుర్తించారు. సాయంత్రం కొండాయి సమీపంలో జంపన్న వాగులో మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండాయి గ్రామంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి.. ఆ గ్రామాన్ని ముంచెత్తడంతో ఎనిమిదిమంది వరద నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు. గాలింపు చేపట్టిన సహాయక బృందాలను గల్లంతైన వారి మృతదేహాలను గుర్తించాయి.

ఇంకా జలదిగ్బంధంలోనే కొండాయి గ్రామం

జంపన్నవాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఏటూరునాగారం మండలంలోని చాలా గ్రామాలను ముంచెత్తింది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కొండాయి గ్రామంతో పాటు, మల్యాల, దొడ్ల గ్రామాల్లో సైతం పూర్తిగా ఇళ్ల పైకప్పు స్థాయిలో వరద మట్టం చేరింది. ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. హాహాకారాలు చేస్తూ దిక్కు తోచని స్థితిలో ఎవరికి తోచిన దారిన వారు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. ఎటు వెళుతున్నారో తెలియదు, ఎలా ఆశ్రయం పొందాలో తెలియదు.. ఒక్కసారిగా భయాందోళనకు గురై వరద ముంపు నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఊరి చుట్టూ చేరిన వరద నీరు ఒకేసారిగా ఊరంతా కమ్ముకుపోయి ఏకంగా ఇళ్లను సైతం ముంచి వేసింది. జంపన్నవాగు వరద నుంచి కాపాడేందుకు నిర్మించిన కరకట్ట కూడా తెగిపోయింది. వాగుపై నిర్మించిన వారధి కుంగిపోగా వరద ఉద్ధృతికి బ్రిడ్జి కొట్టుకుపోతుందేమోనన్న భయానికి గురయ్యారు. కొండాయి గ్రామం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని