Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 24 Sep 2021 13:00 IST

1. మొదలైన తెలంగాణ శాసనసభ సమావేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, అజ్మీరా చందూలాల్‌, కేతిరి సాయిరెడ్డి, కుంజా భిక్షం, మేనేని సత్యనారాయణరావు, మాచర్ల జగన్నాథం, రాజ్యయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్య మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభ వాయిదా పడింది.

TS Congress : ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

2. AP News: అక్కడ తెదేపాకు ఎంపీపీ.. జనసేనకు వైస్‌ ఎంపీపీ

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. తెదేపాకు ఎంపీపీ పదవి ఇచ్చేందుకు జనసేన సమ్మతించింది. దీంతో జనసేనకు వైస్‌ ఎంపీపీ పదవి ఇచ్చేందుకు తెదేపా అంగీకరించింది.

AP News: ఉత్కంఠ రేపుతున్న దుగ్గిరాల ‘ఎంపీపీ’.. ఎన్నికకు తెదేపా దూరం

3. TS News: వ్యక్తిగత ప్రచారానికి ఆరాటపడితే కాంగ్రెస్‌లో కుదరదు: జగ్గారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌ జహీరాబాద్‌ పర్యటనకు వస్తున్నట్లు తనకు సమాచారం లేదని.. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే కాంగ్రెస్‌ పార్టీలో కుదరదని వ్యాఖ్యానించారు. కనీసం మాజీ మంత్రి గీతారెడ్డికి కూడా సమాచారం లేదన్నారు. సంగారెడ్డి వస్తే తనకు సమాచారం తెలియలేదని చెప్పారు.

4. రైతు ఆత్మహత్యలన్నీ తెరాస ప్రభుత్వ హత్యలే: బండి సంజయ్‌

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ తెరాస ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ఆరోపించారు. 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతు రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.27,500కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.

5. సర్వదర్శనం టోకెన్లు నిలిపేసిన తితిదే.. శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం వద్ద శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ఆందోళనకు దిగారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని తితిదే అధికారులు చెబుతున్నారు. శ్రీనివాసం వసతి గృహం నుంచి భక్తులను వెనక్కి పంపేందుకు యత్నిస్తున్నారు. టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు.

* TTD: తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. నిలిచిన టికెట్ల బుకింగ్‌

6. Crime News: హయత్‌నగర్‌లో దారుణం.. భార్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి..

హైదరాబాద్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య మృతదేహాన్ని బాతుల చెరువు అలుగువద్ద పడేస్తుండగా స్థానికులు సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన భార్య అనారోగ్యంతో మృతిచెందిందని డబ్బులు లేక ఆమె మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్లినట్లు శ్రీను చెబుతున్నాడు.

7. India Corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు..

దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు, మరణాల్లో  హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,382 మందికి కరోనా సోకింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా..ఇప్పటివరకు 4.46లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. 

8. Stock market : బీఎస్‌ఈ చరిత్రలో మరో అద్భుత ఘట్టం!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం సెన్సెక్స్‌ ఆరంభంలోనే 60,000 పాయింట్ల మరుపురాని మైలురాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

Stock Market: బుల్‌అబ్బాయ్‌కి బలమొచ్చిందిలా..!

9. Afghanistan: కాళ్లు, చేతులు నరికే శిక్షలు మళ్లీ వస్తాయ్‌ 

ఒకప్పటిలా క్రూర విధానాలను ఈ దఫా పాలనలో అనుసరించబోమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన తాలిబన్లు ఇప్పుడు మాట మార్చారు! అఫ్గానిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

10. IPL 2021 - Mumbai Indians: అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతాయి : రోహిత్

అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతాయని ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గురువారం రాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడాడు.

IPL 2021 - Delhi Capitals: పంత్‌ విషయంలో జట్టు నిర్ణయాన్ని గౌరవిస్తా: శ్రేయస్

2007 T20 World Cup: క్రికెట్ చాణక్యుడు ధోనీ కెప్టెన్సీకి అసలైన నిర్వచనం ఈ విజయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని