AP News: దిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అమరావతి రైతులు

అమరావతిలో కేంద్ర ప్రభుత్వం సంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని రైతులు కేంద్రాన్ని కోరారు.

Updated : 06 Apr 2022 06:51 IST

దిల్లీ: అమరావతిలో కేంద్ర ప్రభుత్వం సంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని రైతులు కేంద్రాన్ని కోరారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో దిల్లీ వెళ్లిన రాజధాని రైతులు కేంద్ర మంత్రులు నారాయణ్‌రాణే, నరేంద్రసింగ్ థోమర్‌, నిర్మలా సీతారామన్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశారు. అమరావతిలో సెంట్రల్‌ ఇన్సిస్టిట్యూ్‌ట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ సంస్థలు త్వరగా ఏర్పాటు చేయాలని నారాయణ్‌రాణేను కోరారు. ఇప్పటికే  5 ఎకరాల కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం కూడా రూ.20 లక్షల 45 వేలు చెల్లించిందని గుర్తుచేశారు. దీనిపై నారాయణ్‌రాణే సానుకూలంగా స్పందించారని, వచ్చే నెలలో తప్పనిసరిగా శంకుస్థాపన చేస్తామని నిర్దిష్ట హామీ ఇచ్చారని రాజధాని రైతులు తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ థోమర్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశమయ్యారు. ఆర్థికశాఖకు సంబంధించి 17 నుంచి 20 సంస్థల భవనాలను నిర్మించాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌కు రైతులు విన్నవించారు. ఆయా భవనాలపై అధ్యయనం చేసి అన్ని విభాగాలకు లేఖలు రాస్తానని నిర్మలా సీతారామన్‌ వారికి చెప్పారు. అమరావతి రైతుల పోరాటానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరీతో కలిసి అమరావతి రైతులు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని