ఆనందయ్య మందుపై సోమవారం తుది నిర్ణయం!

ఆనందయ్య ఔషధ పంపిణీపై సోమవారం అంతిమ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడించారు. ఈ మందు...

Updated : 28 May 2021 19:58 IST

అమరావతి: ఆనందయ్య ఔషధ పంపిణీపై సోమవారం అంతిమ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడించారు. ఈ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు చెప్పారు. కొవిడ్‌ కట్టడి చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఆనందయ్య ఔషధం పైనా సీఎం చర్చించినట్టు రాములు తెలిపారు. ఆనందయ్య ఔషధంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఔషధ పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుంది. నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుంది. సీసీఆర్‌ఏఎస్‌ అధ్యయన నివేదిక రేపు వచ్చే అవకాశం ఉంది. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం. కంటి మందుపై ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకు విచారణ నివేదికలు సానుకూలంగా వచ్చాయి. టెలిఫోన్‌ విచారణలోనూ చాలా మంది సానుకూలంగానే చెప్పారు. ఈ ఔషధంపై క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా ప్రారంభించలేదు. ఔషధంపై ఆనందయ్య ఆయుర్వేద విభాగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది’’ అని రాములు వివరించారు.

ఆనందయ్య ఇంటి వద్ద బందోబస్తు
మరోవైపు, కృష్ణపట్నంలోని తన ఇంటికి ఆనందయ్య చేరుకున్నారు. ఈ నెల 21న ఔషధ పంపిణీ నిలిచిపోవడంతో వారం తర్వాత వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్థులు వస్తున్నారు. దీంతో ఆనందయ్య ఇంటి వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నానికి రాకపోకలను నిలిపివేశారు.

ఆనందయ్య పంపిణీ చేస్తోన్న ఔషధంపై పరిశోధన జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత అందరికీ మందును అందుబాటులో ఉంచనున్నట్టు ఆనందయ్య చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని