AndhraPrdesh : ఐఆర్‌ అంటే.. వడ్డీ లేని అప్పు అని మాకు తెలియదు: పీఆర్సీ సాధన సమితి నేతలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ నేతల స్టీరింగ్‌ కమిటీ సమావేశం

Updated : 04 Feb 2022 16:30 IST

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ నేతల స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం విలేకర్లతో నేతలు మాట్లాడారు. వేతన సవరణ తేదీకి అమలు తేదీకి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఎప్పుడూ మధ్యంతర భృతి వెనక్కి తీసుకోలేదని సూర్యనారాయణ గుర్తు చేశారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పు అని మాకు తెలియదని చెప్పారు. మధ్యంతర ఉపశమనం ఏ రకంగా రుణంగా కనిపించిందో అధికారులు చెప్పాలని పేర్కొన్నారు. ఐఏఎస్‌లా గొప్ప చదువులు చదవకపోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతి ఉద్యోగికీ తెలుసునన్నారు. ఐఆర్‌ జీవోలో ఒక రకంగా.. గత పీఆర్సీలో మరోలా ఉండటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని చెప్పారు. జీవోను నిలుపుదల చేయాలని చెప్పినా.. అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అవగాహనారాహిత్యం ఎవరిదో ప్రభుత్వమే అర్థం చేసుకోవాలని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్ర పే కమిషన్‌కు వెళ్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తోందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదన్నారు. ఉద్యోగులకు మాత్రం సమస్యల పరిష్కారమే కావాలని స్పష్టం చేశారు. ‘‘సమ్మె చేస్తే ఉద్యోగులకు జీతాలు వస్తాయా? రావు కదా.?ప్రభుత్వానికి అన్ని రకాలుగా చెప్పి చూశాకే సమ్మెకు వెళ్తున్నాం. ఉద్యోగులు చర్చలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగులను పిలవకుండానే చర్చలకు పిలిచినట్లు చెప్పవద్దు. పీఆర్సీ నివేదికను బయటపెట్టడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. పాత స్కేల్‌ ప్రకారం డీఏ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా? డీఏలతో సంబంధం లేకుండా పీఆర్సీని పరిగణనలోకి తీసుకోవాలి. డీఏలు లేకుండా కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతం తగ్గుతుంది. హెచ్‌ఆర్‌ఏ మారిన చోట మాత్రం కొంతమేర జీతం పెరిగింది. చర్చల పేరిట ఉద్యోగులను అవమానపరుస్తున్నారు. గతంలో చర్చలకు పిలిచి చాయ్‌, బిస్కెట్ ఇచ్చి పంపారు. బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా?’’ అని బొప్పరాజు ప్రశ్నించారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్‌లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని మరో నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీకి డీఏకి ఏదన్నా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి కేంద్రం ఆదేశాల మేరకు చెల్లింపు ఉంటుందన్నారు. సీఎం చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలీదని, ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయని చెప్పారు. 

అనమోలిస్‌ కమిటీ అంటున్న అధికారులకు దానిపై అవగాహన లేనట్టుందని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వేతన సవరణలో ఒక సీనియర్‌ ఉద్యోగికి జూనియర్‌ కన్నా అన్యాయం జరిగితే దానిని పరిష్కరించడానికి ఆ కమిటీ పని చేస్తుందన్నారున. ఉద్యోగుల ఉద్యమాన్ని చంపేందుకు ప్రభుత్వం కొన్ని ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు అనామలిస్‌ కమిటీ ఎక్కడుందో ఉద్యోగులు వెతుక్కోవాలా? అని ప్రశ్నించారు. వేతన గణన అనేది అర్థం కాని బ్రహ్మపదార్థంలా అధికారులు మార్చేశారని విమర్శించారు. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను పక్కన పెట్టి అధికారుల కమిటీ నివేదిక అమలు చేసి అన్యాయం చేశారని చెప్పారు. ఓ వైపు అభ్యంతరాలు చెప్పుకునే సమయంలోనే చీకటి జీవోలు ఇచ్చారన్నారు. ఉద్యోగులను భయపెట్టేలా బదిలీలు చేసేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఎత్తుగడలను ఉద్యోగులు, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరిస్తే అత్యవసర  సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తొలిసారిగా జ్యుడీషియల్‌ ఉద్యోగులు కూడా పీఆర్సీపై ఆందోళన చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం ప్రతినిధి వేణుగోపాల్ తెలిపారు. రాజ్యాంగపరంగా విధులు నిర్వహించాల్సిన హైకోర్టు ఉద్యోగులు కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కారన్నారు. చలో విజయవాడ చూసి అయినా ప్రభుత్వం పీఆర్సీ జీవోలను సమీక్షించుకోవాలని సూచించారు. వచ్చే బుధవారం కోర్టు ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పాటై కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని