
Thali food: గంటలో 7 కిలోల థాలీని తినగలరా..?
‘గ్రాండ్ గ్రేట్ థాలీ’ పేరుతో ఛాలెంజింగ్ ఆఫర్
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఆహారప్రియులా? ఒకేసారి 7 కిలోల థాలీని లాగించగలరా? అయితే, మీ కోసమే ఓ రెస్టారెంట్ ఎదురుచూస్తోంది. ఎక్కడా అనుకుంటున్నారా? ఈ బంపర్ ఆఫర్‌ను ఇంగ్లాండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్ ప్రకటించింది. ‘గ్రాండ్ గ్రేట్ థాలీ’ పేరుతో కేవలం 35 పౌండ్లకే (దాదాపు రూ.3,611) 7 కిలోల థాలీని అందిస్తోంది. ఈ ఛాలెంజ్‌లో ఎలాగైనా గెలవాలని ఆహార ప్రియులు తెగ పోటీపడుతున్నారు. ఇంగ్లాండ్‌లోని ఆస్టన్, మాంచెస్టర్‌లాంటి ప్రముఖ నగరాల్లోని రెస్టారెంట్లలో గ్రాండ్ థాలీ ఛాలెంజ్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ‘లిల్లీ వెజిటేరియన్ ఇండియన్ క్యూజిన్’ పేరుతో నెలకొల్పిన భారతీయ రెస్టారెంట్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టారు.
ఏయే వెరైటీలు ఉంటాయంటే..?
‘గ్రాండ్ గ్రేట్ థాలీ’ డిష్‌లో 8 రకాల రోటీలు, 3 రకాల రైస్, 16 రకాల కూరలు, 3 డిప్స్, 6 డెజర్ట్స్, 2 లస్సీలు, 2 రకాల స్నాక్స్‌లతో కలిపి మొత్తం 50 రకాల పదార్థాలుంటాయి. వీటన్నింటిlw పెద్ద ప్లేట్‌లో ఒకేసారి తీసుకొచ్చి ముందుపెడతారు. అన్ని వెరైటీలను వదిలిపెట్టకుండా గంటలోనే లాగించేయాలి.
ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?
ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి రెస్టారెంట్‌కు వెళ్లిన డ్రెన్నన్ అనే వ్యక్తి తన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఛాలెంజ్ వెలుగులోకి వచ్చింది.
ఒకవేళ ఛాలెంజ్‌లో నెగ్గకపోతే..
ఛాలెంజ్‌ను స్వీకరించి 7 కిలోల థాలీని గంటలో తినలేకపోతే మిగిలిన ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్లే సదుపాయాన్ని రెస్టారెంట్ కల్పిస్తోంది. ఇంటికి తీసుకెళ్లకుండా వెళ్లిన వారి ఆహారాన్ని అనాథలకు, నిరుపేదలకు పెడుతుంది. ‘మేము ఆహారాన్ని వృథా చేయట్లేదు. ఇది ఒక ఫన్ కోసమే నిర్వహిస్తున్నాం. దయచేసి తప్పుగా ఎవరూ భావించొద్దు’ అంటూ రెస్టారెంట్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంది.