Viveka Murder Case: ఆధారాల ధ్వంసంలో అవినాష్‌రెడ్డి పాత్ర: హైకోర్టుకు తెలిపిన సీబీఐ

వివేకా హత్య కేసు (Viveka Murder case)లో అవినాష్‌ (MP Avinash Reddy) విచారణకు సంబంధించిన వివరాలను సీబీఐ సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు అందజేసింది. ఆధారాలను ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఉందని పేర్కొంది. 

Published : 13 Mar 2023 15:05 IST

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో తనపై సీబీఐ (CBI) తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి (MP Avinash Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్‌ విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది.

అవినాష్ విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ పాత్ర ఉందని.. ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు వెల్లడించే వరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దని సీబీఐను ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్‌ చేసింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. భాస్కర్‌రెడ్డిని విచారణ అంశం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయితే కడపకు ఎందుకు పిలిచారని ప్రశ్నించింది. కడపలో విచారణకు తాము పిలవలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు సీబీఐ ఆఫీసు వద్ద అవినాష్‌ ప్రెస్‌మీట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్‌ మీట్‌ ఏంటని ప్రశ్నించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు